రుయాలో కోవిడ్ వార్డు
తిరుపతి తుడా : కరోన మహమ్మారి మరోసారి విస్తరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. పొరుగు దేశాల్లో కోవిడ్ తీవ్రత అధికంగా ఉండడంతో సర్కారు మార్గదర్శకాలను విడుదల చే సింది. ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో కోవిడ్ ఐసోలేషన్ ఏర్పాటు చేయా లని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధ శుక్రవారం వి భాగాధిపతులతో సమావేశమయ్యారు. కోవిడ్ నిర్ధార ణ పరీక్షలకు రాపిడ్ కిట్లు కొనుగోలు చేయాలని అలానే ఐసోలేషన్ వార్డుకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కేటాయింపులపై ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేకంగా 20 పడకలు
కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రుయా ఆస్పత్రిలో 20 బెడ్లతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. 20 పడకలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తగు జాగ్రత్తలతో కూడిన కౌంటర్ సిద్ధం చేస్తున్నారు. శనివారం నుంచి కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంటాయని రుయా సూపరింటెండెంట్ రాధ తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు అధికంగా ఉన్న వారు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మార్గదర్శకాలు పాటించాలి
కోవిడ్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్ తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
రుయాలో కోవిడ్ వార్డు


