
తిరుపతి ఐఐటీకి మహర్ధశ
● ఫేజ్–బీ నిధులు రూ.2,313 కోట్లతో తిరుపతి ఐఐటీకి దీటైన వసతులు ● నూతన ఆవిష్కరణలకు కేంద్ర బింధువు కానున్న తిరుపతి ఐఐటీ ● 12 వేల మంది విద్యార్థులతో క్యాంపస్ మాస్టర్ ప్లాన్ ● ఐజర్‌తో కలిసి మరిన్ని సైన్స్ పరిశోధనలు ● తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ
ఏర్పేడు (రేణిగుంట) : తిరుపతి ఐఐటీకి కేంద్రం ఫేజ్–బీ అభివృద్ధి పనుల కింద రూ.2,313 కోట్లు నిధులు కేటాయించడంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్యాంపస్ రూపకల్పన చేస్తామని ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లోని పరిపాలన భవనంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం దేశంలోని ఐదు ఐఐటీలైన తిరుపతి ఐఐటీ, కేరళ రాష్ట్రం పాలక్కాడ్ ఐఐటీ, ఛత్తీస్‌ఘడ్‌లోని భిలాయ్ ఐఐటీ, జమ్మూ ఐఐటీ, కర్ణాటక రాష్ట్రం దార్వాడ్ ఐఐటీలకు 2025–26 నుంచి 2028–29 నాలుగేళ్లకు రూ.11,828.79 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. అందులో భాగంగా తిరుపతి ఐఐటీకి రూ.2,313 కోట్లు కేటాయించిందని తెలిపారు. పదేళ్ల స్వల్పకాలిక ప్రస్థానంలో తిరుపతి ఐఐటీ ఎన్నో అద్భుత విజయాలను అందుకుందన్నారు. అతి తక్కువ కాలవ్యవధిలోనే ఫేజ్–ఏలో రూ.1,444 కోట్లు ఖర్చు చేసి 1,200 మంది విద్యార్థులకు సరిపడా పూర్తిస్థాయి క్యాంపస్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం 1,600 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని, రానున్న ఐదేళ్లలో మరో 1,300 సీట్లు పెరగనున్నట్లు ఆయన వివరించారు. బీటెక్‌తోపాటు ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తిరుపతి ఐఐటీని 12 వేల మంది విద్యార్థులు అభ్యసించే స్థాయికి తీసుకెళ్లటమే ధ్యేయమన్నారు.
ఆవిష్కరణలకు 230 సంస్థలతో ఒప్పందాలు
శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలను తీసుకొచ్చే లక్ష్యంతో ఇప్పటికే 230 సంస్థలతో కలసి భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుని విద్యార్థులకు సమృద్ధిగా అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. తాజాగా కియా మోటార్ ఇండియా కంపెనీతో అయిదేళ్ల కాలానికి రూ.35కోట్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఐఐటీ విద్యార్థులే కాకుండా బయట కళాశాలల విద్యార్థులను ఇన్నోవేషన్ హబ్‌లో భాగస్వామ్యమయ్యే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను తీసుకొస్తున్నారని, అందులో భాగంగా తిరుపతి, అనంతపురం, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నంలో శాఖలను ఏర్పాటు చేసి కొత్త ఆవిష్కరణల రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తిరుపతిలో ఏర్పాటు కానున్న రతన్‌టాటా హబ్‌కు తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో 19 ఎకరాలు స్థలాన్ని కేటాయించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తాము సంసిద్దత వ్యక్తం చేస్తూ ఇటీవల కలెక్టర్‌తో చర్చలు జరిపామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం పైకప్పు లీకేజీ మరమ్మతు పనులను డిజైన్ చేసి పూర్తి చేయించామన్నారు. డిఫెన్స్‌కు సంబంధించి 11 ప్రాజెక్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఏర్పేడు మండలంలో ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. సమావేశంలో ఐఐటీ విభాగాల డీన్‌లు శశిధర్ గుమ్మా, అనిల్ కుమార్, మురళీ కృష్ణ పాల్గొన్నారు.