
20లోపు ‘సుఖీభవ’ సమాచారం
తిరుపతి అర్బన్ : జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల వివరాలను ఈ నెల 20వ తేదీలోపు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జాబితా సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల్లోని అగ్రికల్చర్ అసిసెంట్లను ఆదేశించారు. ఈ పథకం కింద పీఎం కిసాన్ నగదు రూ.6వేలతో కలిసి ప్రభుత్వం విడతలవారీగా రూ.14 వేలు అందించనుంది. జిల్లా వెబ్‌ల్యాండ్ ఆధారంగా చూస్తే మొత్తం 1,43,432 మంది రైతులు ఉన్నారు. రాష్ట్రస్థాయి వెబ్‌ల్యాండ్ ప్రకారం కౌలు రైతులను పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 1,72,657 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వివరాలతో జాబితా తయారు చేసేందుకు అగ్రికల్చర్ అసిస్టెంట్లు కసరత్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఏఆర్ కానిస్టేబుల్ మృతి
వడమాలపేట (విజయపురం) : తిరుపతిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న డిల్లీ (40) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. నాగలాపురం వినోబానగర్‌కు చెందిన డిల్లీ తిరుపతిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా.. వడమాలపేట కదిరిమంగళం మలుపు వద్ద వెంకటగిరికి చెందిన ఓ కుటుంబం అంజేరమ్మను దర్శించుకుని కారులో తిరిగి వెళ్తూ ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన డిల్లీని పోలీసులు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధర్మారెడ్డి తెలిపారు.
డప్పు కొట్టేందుకు వచ్చి..
అనంత లోకాలకు..!
తిరుపతి క్రైమ్: విద్యు దాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీసుల కథనం.. నెల్లూరు జిల్లా గాంధీజీ కాలనీకి చెందిన పెద్దల తిరుపతన్న(20) తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో డప్పు కొట్టేందుకు వచ్చాడు. ఈ క్రమంలో కొరమీనుగుంటలో ఓ ఇంటి వద్ద వేపాకు కోస్తుండగా విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాల తరలించారు.
ఐపీఎల్ తరహాలో సీపీఎల్
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) తరహాలో చిత్తూరు ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సీజన్–1 క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయకుమార్ తెలిపారు. బుధవారం తిరుపతిలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18 నుంచి తిరుపతిలోని ఎస్వీయూ మైదానంలో సీపీఎల్ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 17నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న క్రికెటర్లు పాల్గొనవచ్చని, ఈ నెల 11న మొత్తం 5జట్లను ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. అనంతరం పోటీల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో సంఘం నేతలు గిరి ప్రకాష్, శ్రీనివాసమూర్తి, శ్రీధర్‌కుమార్, సతీష్ యాదవ్, హరి, శివప్రసాద్, డీవీ.రమణ పాల్గొన్నారు.

20లోపు ‘సుఖీభవ’ సమాచారం

20లోపు ‘సుఖీభవ’ సమాచారం