చిత్తూరు కార్పొరేషన్: ఎండ తీవ్రతకు గురి కాకుండా కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల ఉపకార్మిక కమిషనర్ ఓంకార్‌రావు కోరారు. కార్మికుల రక్షణ కోసం పారిశ్రామిక యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తలపై టోపీ పెట్టుకోవడం, తెలుపు రంగు గల పలుచటి కాటన్ వస్త్రం ధరించడం, ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవడం, మంచి నీళ్లు ఎక్కువ సార్లు తాగడంపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కార్మికులను బ్యాంకు, ఇతర పనుల మీద బయటకు పంపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పని ప్రదేశంలో నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. స్థానిక గ్రామ వార్డు సచివాలయం వైద్య సిబ్బందిని సమన్వ యం చేసుకుని ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు సమకూర్చుకోవాలన్నారు.