
పోరాట స్ఫూర్తి భగత్‌సింగ్
తిరుపతి మంగళం : భరతజాతి మరువలేని పోరాట స్ఫూర్తి భగత్‌సింగ్ అని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద భగత్‌సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమన మాట్లాడుతూ 1931 మార్చి 23వ తేదీన దేశం కోసం భగత్‌సింగ్ సగర్వంగా ఉరికంబం ఎక్కారన్నారు. భగత్‌సింగ్‌తోపాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, నేతలు లవ్‌లీ వెంకటేష్, మద్దాలి శేఖర్, పసుపులేటి సురేష్, సుబ్బు, రుద్రగోపి, పుణీత పాల్గొన్నారు.
ఏప్రిల్ 10న మిక్స్‌డ్ బియ్యానికి టెండర్ కమ్ వేలం
తిరుపతి కల్చరల్ : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలాన్ని ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించనున్నట్లు టీటీడీ సీపీఆర్‌ఓ రవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో ఈ మేరకు వేలానికి మొత్తం 12,320 కిలోల బియ్యాన్ని సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు రూ.590 డీడీ తీసి టెండర్ షెడ్యూల్ పొందవచ్చని సూచించారు. వేలంలో పాల్గొనేందుకు రూ.25వేలను ఈఎండీగా చెల్లించాలనన్నారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం, లేదా, 0877–2254429 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఏనుగుల దాడిలో
పంటల ధ్వంసం
భాకరాపేట : ఎర్రావారిపాళెం మండలం నెరబైలు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల విధ్వంసం కొనసాగుతోంది. రెండు రోజులుగా ఏనుగులు పంటలన నాశనం చేస్తున్నాయి. శనివారం రాత్రి ఈ మేరకు వరి, మామిడి పంటలన తొక్కి ధ్వంసం చేశాయి. అటవీ అధికారులు స్పందించి గజరాజులను అటవీప్రాంతంలోకి మళ్లించాలని రైతులు కోరుతున్నారు.

పోరాట స్ఫూర్తి భగత్‌సింగ్