
టీడీఆర్.. ఒకరికే వందనం
తిరుపతి తుడా: నగరంలో మెరుగైన రవాణా వ్యవస్థను తీసుకురావడం, నగరాన్ని మరింతగా విస్తరించాలన్న సంకల్పం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం తిరుపతి నగరంలో 21 మాస్టర్ ప్లాన్ రోడ్లకు శ్రీకారం చుట్టింది. కౌన్సిల్ ఆమోదంతో యుద్ధ ప్రాతిపదికన మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేసింది. ఇప్పటికే 17 మాస్టర్ ప్లాన్ రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి, విస్తరణకు ప్రజలు ఆయా ప్రాంతాల్లో భూములను గిఫ్ట్ డీడ్‌గా మున్సిపల్ కార్పొరేషన్‌కు రాసిచ్చారు. ఈ క్రమంలో భూములిచ్చిన రైతులు, యజమానులకు టీడీఆర్ ( ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) బాండ్లను ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమందికి టీడీఆర్ బాండ్లు సకాలంలో అందించగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిపై ఆంక్షలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీఆర్ బాండ్ల జారీపై ఇప్పటికే రెండు కమిటీలను వేసింది. అయితే టీడీఆర్ బాండ్ల జారీలో మామూళ్లకు కక్కుర్తి పడి ఆశించిన స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎంఓ ఒత్తిడితో..
తిలక్ రోడ్డు జబ్బర్ వీధి విస్తరణలో ఇంటి స్థలం కోల్పోయిన ఇనయతుల్లా తనకున్న పలుకుబడితో టీడీఆర్ బాండ్ కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. రూ 2.5 కోట్ల విలువ గల టీడీఆర్ బాండ్ కోసం ఆయన సీఎంఓలో పావులు కదిపారు. సీఎంఓతో పాటు ఓ మంత్రి నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఒత్తిడి పెరిగింది. తప్పని పరిస్థితుల్లో తిరుపతి జబ్బార్ లే అవుట్‌కు చెందిన ఇనయతుల్లా కు టీడీఆర్ బాండును ఒక్కరోజు వ్యవధిలోనే జారీ చేసిన ఘనత కార్పొరేషన్ ఉన్నతాధికారులకే దక్కింది. టీడీఆర్ బాండ్ల కమిటీ నేరుగా సమావేశం కాకుండానే శనివారం రాత్రికి రాత్రే టీడీఆర్ బాండ్‌ను మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ మౌర్యకు భూములు కోల్పోయిన యజమానులు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని వేడుకుంటున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదు.
వందల మందికి మొండిచెయ్యి
సీఎంఓ నుంచి ఒత్తిడి తేవడంతో ఆగమేఘాలపై జారీ
కమిటీ నేరుగా హాజరుకాకుండానే ఆమోదం
అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
నాలుగు జిల్లాల అవతల ఉన్నతాధికారి.. ఆఘమేఘాలపై జూమ్ మీటింగ్.. వాట్సాప్‌లో సంతకం చేసిన దస్త్రం.. రాత్రికి రాత్రే ఆమోదం.. జారీ.. ఇందంతా ఒక్కరికే వందనం.. మిగిలిన వారికి శూన్యహస్తం. ఇదీ తిరుపతి నగరాభివృద్ధిలో రోడ్ల విస్తరణకు జారీ చేసిన ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్) బాండు కథ.
టీడీఆర్ బాండ్ల వివరాలు
మొత్తం టీడీఆర్ బాండ్లు 1149
ఇప్పటి వరకు జారీ చేసినవి 442
ఇవ్వాల్సినవి 707
ఒక్కరి కోసం కదిలిన యంత్రాంగం
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల వ్యవహారం వాడి వేడిగా ఉంది. రోడ్ల అభివృద్ధి కోసం భూములు వదులుకున్న రైతులు, యజమానులకు నష్టపరిహారం కింద టీడీఆర్ బాండ్లను ఇవ్వాల్సి ఉంది. వీటి జారీ కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, డిప్యూటీ సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్, అనంతపురం రీజినల్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ టీడీఆర్ బాండ్ల జారీపై పూర్తిస్థాయిలో రికార్డులను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో విచారణ అనంతరం అన్ని సక్రమంగా ఉంటే యజమానులకు టీడీఆర్ బాండ్లను జారీ చేయాల్సి ఉంది. వందల మంది టీడీఆర్ బాండ్ల కోసం ఎదురు చూస్తుంటే కేవలం ఒకరి కోసం ఆగమేఘాలపై జూమ్ మీటింగ్ నిర్వహించి రాత్రికి రాత్రి మంజూరు చేశారు. కమిటీ కూర్చుని రికార్డులను పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు లేని పక్షంలో బాండ్‌ను జారీ చేయాలి. అలా కాకుండా ఇన్‌చార్జి రీజినల్ డైరెక్టర్ కర్నూలులో ఉండగానే వాట్సప్ ద్వారా సంతకం చేసిన దస్త్రాన్ని తెప్పించుకుని టీడీఆర్ బాండ్‌కు ఆమోదం చేయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.