పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు 196 మంది హాజరు

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ బాలాజీ - Sakshi

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు మొత్తం 196 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపల్‌ ద్వారకనాథరెడ్డి తెలిపారు. 59,001వ ర్యాంకు నుంచి 75వేల ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించినట్లు వెల్లడించారు. శనివారం 75,001నుంచి 92వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ చేపట్టనున్నట్లు వివరించారు.

వ్యవసాయశాఖలో బదిలీలు

తిరుపతి అర్బన్‌ : వ్యవసాయశాఖలో సాధారణ బదిలీలు చేపట్టారు. తొలి దశలో నలుగురు ఏడీలు, మరో నలుగురు ఏఓలకు స్థాన చలనం కల్పించారు. సత్యవేడు ఏడీ రమేష్‌రెడ్డిని శ్రీకాళహస్తికి, తిరుపతి ఏడీసుబ్రమణ్యంను సత్యవేడుకు, శ్రీకాళహస్తి ఏడీ మనోహర్‌ను తిరుపతికి, సూళ్లూరుపేట ఏడీ నాగరాజును శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి, కావలి ఏడీ అనిత సూళ్లూరుపేటకు బదిలీ చేశారు. అలాగే తడ డో జ్యోత్మిరయిని దొరవారిసత్రం, ఇక్కడ పనిచేస్తున్న తులసీరామ్‌ను నిండ్రకు, నిండ్ర ఏఓ మురళిని కేవీబీపురం, ఇక్కడి ఏఓ నర్మదను చిత్తూరుకు, ప్రకాశం జిల్లాలో డెప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న దీపను వాకాడు ఏఓగా నియమితులయ్యారు.

జగనన్నకు చెబుదాం..

స్పందనకు ప్రాధాన్యం

తిరుపతి అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని, అర్జీల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి జేసీ డీకే బాలాజీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్‌ఓలతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్‌ దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్‌ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అసైన్డ్‌ భూములకు సంబంధించిన ఫైల్స్‌, కోర్టు కేసుల్లో సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ కోదండరామిరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, ఏడీ సర్వేయర్‌ జయరాజ్‌ పాల్గొన్నారు.

బదిలీలకు దరఖాస్తులు చేసుకోండి

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీ వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు కేజీబీవీ ఉద్యోగుల బదిలీల కసరత్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ బదిలీలకు నిబంధనలకు లోబడి ఈనెల 5వ తేదీ నుంచి 7వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కేజీబీవీ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు, పాలనాపరంగా బదిలీ అయిన వారు ఈ బదిలీలకు అనర్హులని తెలిపారు. అలాంటి వారు ఉన్నట్‌లైతే కేజీబీవీ ఎస్‌వోల కవరింగ్‌ లెటర్లను ఈ నెల 7 లోపు చిత్తూరు డీఈవో కార్యాలయంలో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలని ఏపీసీ తెలిపారు.

మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ ఆవిష్కరణ

సూళ్లూరుపేట : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా పోస్టర్‌ను ఎమ్మెల్య కిలివేటి సంజీవయ్య శుక్రవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సెజ్‌లలో ఏర్పాటు చేసిన 16 బహుళజాతి కంపెనీల్లో సుమారు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి ఫెయిల్‌, పాస్‌ అయిన విద్యార్థులు, ఇంటర్‌, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నిరుద్యోగులకు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. జగనన్న అందిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు శ్యామ్‌ మోహన్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top