
యాదగిరిగుట్ట: ఆ బాలికకు చదువుకోవాలని ఉంది.. కానీ పేదరికం అడ్డొచ్చింది. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో అమ్మమ్మతో కలసి భిక్షాటన చేస్తోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో భిక్షాటన చేస్తున్న ఆ బాలికను యాదగిరిగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ పలకరించి, చదివించేందుకు ప్రయత్నం చేశారు. మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లోని టైలర్ కాలనీకి చెందిన పార్వతమ్మ, ఆమె 12 సంవత్సరాల మనుమరాలు శిరీషలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు.
శిరీషకు చదువుకోవాలని ఉన్నా పేదరికంతో చదువుకు దూరమైంది. పొట్టకూటికోసం కొంత కాలంగా తన అమ్మమ్మ పార్వతమ్మతో కలసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వైకుంఠద్వారం వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి సోమవారం అటుగా వెళ్తూ బాలికను గమనించి ఆమె వద్దకు వెళ్లారు.
చదువుకోకుండా భిక్షాటన ఎందుకు చేస్తున్నావని శిరీషను అడిగారు. దీంతో శిరీష ఏడుస్తూ.. తనకు చదువుకోవాలని ఉన్నా డబ్బులు లేవని, పూటగడవడం కోసం అమ్మమ్మతో కలసి భిక్షాటన చేసేందుకు వచ్చానని చెప్పింది. దీంతో చలించిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి.. భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు.. శిరీషకు, ఆమె అమ్మమ్మకు కౌన్సెలింగ్ చేసి భువనగిరి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. బాలికకు సాయం చేసిన కానిస్టేబుల్ కోటిని ట్రాఫిక్ సీఐ కృష్ణ అభినందించారు.