World Food Day: ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!

World Food Day 2022: Health Food Everything You Need To Know It - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎంతో ఇష్టపడి తినే ఆహారం అనారోగ్యం పాలు చేయకూడదు. ఎందుకంటే కొన్ని బయట మార్కెట్‌లలో ఉన్న హోటల్స్, ఫాస్డ్‌ఫుడ్‌ సెంటర్లలో కుళ్లిన మాంసాన్ని జనానికి అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. అందుకే ముక్క తినే ముందు జాగ్రత్త పడండి. నేడు వరల్డ్‌ ఫుడ్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం..  

చట్టం ఏం చెబుతుంది
ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 2018 జూలై 10న ది ఈట్‌ రైట్‌ మూవ్‌మెంట్‌ అనే చట్టం తీసుకువచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను ఆహార తనిఖీ అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించాలి. నమూనాలను సేకరించి వాటిని పరీక్షలకు పంపాలి. అనారోగ్యకర పదార్థాలు ఉంటే జరిమానా, లేదంటే హోటళ్లను సీజ్‌ చేసే అధికారం ఉంది. భోజన హోటళ్లు, రెస్టారెంట్లు, మటన్, చికెన్‌ దుకాణాలకు చాలా వరకు అనుమతులు లేవు. ట్రేడ్‌ లైసెన్సు తీసుకోకుండానే దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. కొన్ని హోటల్స్‌ కనీస నిబంధనలు పాటించడం లేదు. ఎన్‌ఓసీ, పారిశుద్ధ్య ధ్రువపత్రాలు కచ్చితంగా తీసుకోవాలి. 

► వంటలు చేసే గదులు, వంటపాత్రలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. కనీసం ఆరు నెలలకు ఒకసారైనా గోడలు అంతా శుభ్రం చేసి పెయింట్‌ వేయాలి. 
► హోటళ్లలో పని చేసే సిబ్బందికి ఎలాంటి రోగాలు లేవని వైద్యుడి నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి. 
► ఎలుకలు, బొద్దింకలు, పంది కొక్కులు, ఈగలు, దోమలు గదుల్లోకి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. 
► తాజాగా ఉన్న ఆహార పదార్థాలే వంటల కోసం వినియోగించాలి. 
► ఆహారం నిల్వ చేసినా, ఉడికించినా ని   ర్ణీత సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు పాటించాలి. 
► ఉడికించి చల్లార్చిన ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది. చల్లారాక వేడి చేసినప్పుడు ప్రతి ముక్కా పూర్తిగా వేడి అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
► మాంసం తరిగిన కత్తితో కూరగాయలు కోయకూడదు. రిఫ్రిజిరేటర్‌లో శాఖాహార, మాంసాహార పదార్థాలు వేర్వేరుగా నిల్వ ఉంచాలి. 

 ఆరోగ్య సమస్యలు వస్తాయి 
కల్తీ, నిల్వ ఉంచిన  మాంసంతో, కూరగాయాలతో చేసిన వంటకాలు తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిల్వ చేసిన మాంసంలో సాల్మొనెల్లా, ఈకోలి వంటి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది తింటే ఆహారం విషతుల్యమై ప్రాణాల మీదకు రావొచ్చు. డయేరియా, కలరా, నీళ్ల విరోచనాలు, వాంతులు దారి తీయవచ్చు. ఆధునిక కాలంలో ప్రజలు ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని పక్కన పెడుతూ, వ్యాధులు ప్రబలడానికి కారణభూతమవుతున్న భోజనానికి పెద్దపీట వేస్తున్నారు.

చిరుధాన్యాలతో కూడిన అల్పాహారాన్ని వదిలిపెట్టి భోజనం తీసుకుంటుండటంతో అనారోగ్యానికి లోనవుతున్నారు. ప్రధానంగా గ్రామీణా మహిళలు ఐరన్, కాల్షియం లోపంతో రక్తహీనత, పురుషులు ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోలేక గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, చర్మ, క్యాన్సర్‌ తదితర దీర్ఘకాలిక రోగాలభారిన పడుతున్నారు. ఆరోగ్యవంతంగా ఉండాలంటే చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.  
– డాక్టర్‌ బాల శ్రీనివాస్, జనరల్‌ ఫిజిషియన్‌  

ఆహారం కల్తీ  
కోళ్ల ఫారాల్లో జబ్బుపడి చనిపోయిన కోళ్లను తక్కువ ధరకే కొని వాటిని అసలైన చికెన్‌లో కలుపుతున్నారు. ఇక కొన్ని కోళ్ల ఫారాల్లో తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగడానికి మందులు వినియోగిస్తున్నారు. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

► మటన్‌లో పశుమాంసం, జబ్బు పడి చనిపోయిన గొర్రెలు, మేకల మాంసాన్ని కల్తీ చేస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే మాంసం తాజాదనం, రంగును బట్టి కల్తీ గుర్తించే వీలుంది. 

► చేపలు ఎక్కువగా ఐస్‌లో నిల్వ చేసి విక్రయిస్తుంటారు. కొన్నిసార్లు రోజుల తరబడి నిల్వ ఉంటాయి. తాజా సరుకులో ఇలాంటి వాటిని కలిపి అమ్ముతారు. సాధారణంగా చేపను తాకినప్పుడు మెత్తగా అనిపించినా, మొప్పల లోపల భాగం ఎర్రగా కాకుండా నల్లగా మారినా నిల్వ కింద లెక్క.  

రంగులతో మాయ  
చాలా హోటళ్లు, రెస్టారెంట్లు రంగులతో మాయ చేస్తుంటాయి. నిల్వ ఉన్న, కుళ్లిపోయిన మాంసాన్ని రంగుల్లో ముంచి, ఉప్పు, కారం దట్టించి వేడి చేసి తాజాగా వడ్డిస్తుంటారు. ఆకలిలో గమనించకుండా చాలా మంది తినేస్తుంటారు. రాత్రి వేళలలో రంగులు తప్ప వాటిని నాణ్యత గుర్తించలేని పరిస్థితి. తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోతుంది. చాలా రోజులపాటు నిల్వ ఉన్న చికెన్, మటన్‌ రుచిలో తేడా కచ్చితంగా ఉంటుంది. 

అవగాహన కల్పిస్తాం.. 
ఆరోగ్యానికి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం ఎంతో అవసరం. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలి. మండల స్థాయిలో కార్యక్రమాల అమలుపై డాక్యుమెంటరీ సమర్పించాలని ఎంఈవోలకు ఆదేశించాం. కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. 
– గోవిందరాజులు, డీఈఓ, నాగర్‌కర్నూల్‌    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top