
జనగామ: కేన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ చేసే క్రమంలో జుట్టు దాదాపుగా ఊడిపోతుంది. తద్వారా వారికి విగ్గుల అవసరం ఏర్పడుతోంది. ఈ మేరకు విగ్గుల తయారీ కోసం ఓ ట్రస్ట్‌కు తన 15 ఇంచుల జుట్టును అందజేసి ఉదారతను చాటుకుంది. జనగామ జిల్లాకు చెందిన ఓ స్టాఫ్ నర్స్ ముంబై, తమిళనాడులోని మధురైలో తమ సేవలు సాగిస్తున్న ఓ ట్రస్ట్ బాధ్యులు కేన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసి అందిస్తున్నారు. ఈ విషయం జనగామ జిల్లా బచ్చన్నపేటలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి స్టాఫ్ నర్సు గుజ్జుల శ్వేతకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసింది. అప్పటికే ఆమె మామయ్య కేన్సర్‌తో బాధపడుతున్న క్రమంలో జుట్టు రాలిపోయి మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో కొందరికైనా ఉపయోగపడాలనే భావననతో తన జుట్టును విరాళంగా ఇస్తానని భర్త నరేష్‌కు చెప్పగా ఆయనతో పాటు మిగతా కుటుంబీకులు కూడా ఒప్పుకున్నారు.
దీంతో ట్రస్ట్ ప్రతినిధి శివకు ఫోన్ చేయగా సిబ్బంది ఇటీవలే వచ్చి శ్వేత 15 ఇంచుల జడ(జుట్టు)ను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా శ్వేత ‘సాక్షి’తో మాట్లాడుతూ తల వెంట్రుకలు, జడలను సేకరించే ట్రస్ట్ ప్రతినిధులు విగ్గులు తయారు చేసి కేన్సర్‌తో బాధపడే వారికి అందజేస్తారని తెలిపారు. ఈ విషయాన్ని తానేమి గొప్పగా భావించడం లేదని, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలనే మనసాక్షి సూచనతో చేశానని వెల్లడించారు. కాగా, జుట్టు ఇచ్చిన శ్వేత ఫొటోలను ట్రస్ట్ బాధ్యులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.