మాట మితం.. కరోనా ఖతం!

Without Talking People Can Stop Coronavirus - Sakshi

పని ప్రదేశాలు, ప్రార్థనామందిరాలు రిస్కే... వెంటిలేషన్‌ బాగా ఉంటేనే సురక్షితం

పాటలు పాడడం, గట్టిగా కేకలు పెట్టడం వల్ల వైరస్‌ వ్యాప్తి 

అమెరికాలో ఒక గాయకుడి ద్వారా 52 మందికి పాజిటివ్‌  

తుంపర్ల పరిమాణం 9 మీటర్ల వరకు తగ్గదు... పెద్ద తుంపర్ల కన్నా చిన్నవే డేంజర్‌  

తాజా అధ్యయనాల్లో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: మౌనం కరోనా నియంత్రణలో కీలకంగా పనిచేస్తుందని ప్రపంచ వ్యాప్తంగా జరిపిన తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వీలున్నంత తక్కువ మాట్లాడడం వల్ల పాజిటివ్‌ వ్యక్తుల నుంచి ఇతరులకు ఈ వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం తక్కువని ’ద బీఎంజే’ తన జర్నల్‌లో ప్రచురించింది. అమెరికా, బ్రిటన్, చైనాలతోపాటు పలు దేశాల్లో జరిపిన పరిశోధనల్లో మౌనంగా ఉండడం, మాట్లాడడం, పాటలు పాడడం, గట్టిగా అరవడం వల్ల వైరస్‌ వ్యాప్తికి గల అవకాశాలను వివరించింది. ఈ జర్నల్‌ ప్రకారం.. ఇండోర్‌లో ఉండే పని ప్రదేశాలు, ప్రార్థనా మందిరాల్లో రిస్కే. ఎక్కువ వెంటిలేషన్‌ ఉంటే కొంత ప్రమాదం తగ్గుతుంది. ఇండోర్‌ ప్రదేశాల్లో, వెంటిలేషన్‌ సరిగా లేని దగ్గర ఎక్కువ సేపు ఉండి  మాట్లాడుకోవడం, పాటలు పాడుకుంటూ, కేకలు వేయడం వైరస్‌ వ్యాప్తికి దోహదం చేస్తాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఓ సంగీత కచేరిలో పాల్గొన్నగాయకుడి ద్వారా 52 మందికి కరోనా వైరస్‌ సోకిందని తేలింది.  

తుంపర్లు 9 మీటర్ల వరకు గాలిలో ఎగిరి... 
పాజిటివ్‌ ఉన్న వ్యక్తులు తుమ్మినప్పు డు, దగ్గినప్పుడు మాత్రమే కాకుండా మాట్లాడినప్పుడు, ఇతర సందర్భాల్లో వచ్చే తుంపర్లు గరిష్టంగా 9 మీటర్ల వరకు వాటి పరిమాణం తగ్గకుండా గాల్లో ఎగిరి ప్రయాణిస్తాయి. ఆ తర్వాత వాటి సైజ్‌ తగ్గినా పెద్ద తుంపర్ల కంటే చిన్న తుంపర్ల ద్వారా వైరస్‌ ఎక్కువగా సోకుతుంది. ఏదో 2–3 మీటర్లు భౌతికదూరం పాటించినంత మాత్రాన సురక్షితం అనుకోవడం సరైంది కాదని, మిగిలిన జాగ్రత్తలు పాటించాలని ఈ జర్నల్‌ వెల్లడించింది.

వివిధ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలివి:  
► వెంటిలేషన్‌ బాగా ఉన్న ప్రదేశంలో మాస్క్‌ ధరించి మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా వైరస్‌ వ్యాప్తి జరగదు. మాట్లాడినా ప్రమాదం లేదు. కానీ పాటలు పాడడం, కేకలు వేయడం వల్ల వ్యాప్తికి కొంత అవకాశం ఉంది. అదే జన సమ్మర్ధం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కొంచెం అధికం.  
► వెంటిలేషన్‌ ఎక్కువగా ఉన్నా ఇండో ర్‌ అయితే, ముఖానికి మాస్క్‌ లేకపోతే, ఎక్కువ సేపు అక్కడే ఉంటే, మామూలుగా మాట్లాడితే వైరస్‌ సోకే అవకాశాలున్నాయి. 
► ఇదే పరిస్థితుల్లో పాటలు పాడి, గట్టిగా అరిస్తే మాత్రం వైరస్‌ సోకే ప్రమాదం చాలా ఎక్కువ.  
►  ఫేస్‌ మాస్కులున్నా ఎక్కువమంది ఉన్న ప్రదేశాల్లో వెంటిలేషన్‌ సౌకర్యం సరిగా లేకపోతే మాటలు, పాటలు, అరుపులు వైరస్‌ వ్యాప్తికి కారణమవుతాయి.  
► జన సమ్మర్థం ఎక్కువ ఉండి, ముఖానికి మాస్క్‌ లేకుండా చాలాసేపు ఉంటే మౌనంగా ఉన్నా వైరస్‌ సోకే అవకాశం కొంతమేర ఉంది. 
►  అందుకే వీలున్నంత తక్కువ మాట్లాడడం, మాస్కు ధరించడం, ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం గడపకపోవడం, వెంటిలేషన్‌ ఉన్న అవుట్‌ డోర్‌ ప్రదేశాలను ఎంచుకోవడం ద్వారా కరోనా మహమ్మారి మన దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top