బండి భగీరథ్‌ కేసు.. వాట్‌ వాట్ నెక్స్ట్? | What Next In Bandi Bhageerath Case Latest News Updates In Telugu, Telangana Police Intensify Search With Special Teams | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌ కేసు.. వాట్‌ వాట్ నెక్స్ట్?

May 14 2026 7:31 AM | Updated on May 14 2026 10:47 AM

What Next In Bandi Bhageerath Case Latest News Updates

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్‌ బషీరాబాద్‌ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్‌ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. 

లుక్‌ ఔట్‌ నోటీసులు (ఎల్‌ఓసీ) జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్‌ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు బాధితురాలి ఫోన్‌ 
బాధితురాలైన మైనర్‌ బాలిక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్స్, సోషల్‌ మీడియా కమ్యూనికేషన్‌ ఇతరత్రా కీలకాంశాలను తెలుసుకునేందుకు ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. బాలికను ఫామ్‌ హౌస్‌ తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్‌ షేరింగ్, కాల్స్, సోషల్‌ మీడియా కమ్యూనికేషన్స్‌ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్‌ పరారీలోనే ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్‌ ఫామ్‌హౌస్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, లొకేషన్, కాల్‌ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్‌తోపాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్‌హౌస్‌ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.

విచారణకు సహకరిస్తా: బండి భగీరథ్‌
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆలస్యంగా సాయంత్రం 6 తర్వాత భగీరథ్‌ స్పందించారు. ఈ మేరకు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)కు లేఖను పంపారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తక్కువ సమయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వచి్చన ఆరోపణలు తప్పుడువని.. వీటిని నిరూపించేందుకు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమరి్పంచడానికి తనకు కనీసం రెండు రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసిన వెంటనే దర్యాప్తు అధికారి ముందు హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని పేర్కొన్నారు.

పోక్సో కేసును కావాలని బలహీనపరిచారు: బీఆర్‌ఎస్‌
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారని బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా నేతలు విమర్శించారు. బాధిత బాలికపై లైంగిక, మానసిక వేధింపులు, డిజిటల్‌ వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు నామమాత్ర సెక్షన్లతో కేసు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లకు బదులుగా సాధారణ సెక్షన్లతో కేసు పెట్టడంతో పాటు కొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోవడాన్ని నిలదీశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. 

కేంద్ర మంత్రి కుమారుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, మొబైల్‌ ఫోన్లు, చాట్‌లు, వీడియోలు, డిజిటల్‌ ఆధారాలను స్వాధీనం చేసుకోకపోవడం తదితరాలు విచారణపై అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అలాగే కరీంనగర్‌లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కలి్పంచాలని డిమాండ్‌ చేశారు. బండి భగీరథ్‌తో పాటు కేసులో ఉన్న ఇతరులను అరెస్టు చేయడం, వారిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేయడం, సంబంధిత పోలీస్‌ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టడం సహా మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీజీపీకి సమర్పించినట్లు మహిళా నేతలు వెల్లడించారు.

విదేశాలకు పారిపోకుండా చూడాలి: కల్వకుంట్ల కవిత 
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన విదేశాలకు పారి పోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమారుడిపై ఆరోపణలు వచి్చనా, ప్రధానితో వేదికను బండి సంజయ్‌ పంచుకోవటం శోచనీయమన్నారు. 

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరో సారి మొండిచెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తారని భావించినా, మనకు పొదుపు సూత్రాలు చెప్పి... ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డిలో రైల్‌ రోకో చేసిన కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు మేజిస్ట్రేట్‌ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్‌ ప్రకటించారు.         

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement