మీ సేవకు సలాం: కరోనా బాధితులకు కొండంత భరోసా

Volunteer Groups Helping To Coronavirus Patients In Telangana - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: కరోనా ధనిక, పేద తారతమ్యాలను చెరిపేసింది. మానవ సంబంధాలకు కొత్త అర్థం చెబుతోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అయినవారిని సైతం అనాథలుగా ఆస్పత్రుల్లో, రోడ్లపైనా వదిలేస్తున్నవారు కొందరైతే, కొందరు మనిషికి మనిషే అండగా నిలవాలనే మహోన్నతాశయంతో బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. తమ వంతు సేవలతో మానవత్వాన్ని చాటి చెబుతున్నారు. భోజన సదుపాయంతో ఆదుకోవడంతో పాటు ప్లాస్మా, రక్త దానాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు సైతం నిలబెడుతున్నారు. కొందరు తామే ‘ఆ నలుగురు’గా మారి అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
 

ఫుడ్‌ బ్యాంక్‌ .. బెస్ట్‌ మీల్స్‌ 
నిజామాబాద్‌కు చెందిన ఫుడ్‌ బ్యాంక్‌ గత ఏప్రిల్‌ 23 నుంచి బాధితులకు పౌష్టికాహారం అందిస్తోంది. అన్నం, పప్పు, కూరగాయలు, ఆకు కూరలతో కూరలు, పండ్లు, గుడ్లతో కూడిన భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసి ప్రతి రోజూ 300 మందికి ఉదయం, సాయంత్రం ఉచితంగా అందజేస్తున్నారు. 9966830143 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా మెసేజ్‌లు, వాయిస్‌ కాల్స్‌ స్వీకరిస్తూ ఇంటి వద్దకే తీసుకెళ్లి ఆహారం అందజేస్తున్నారు.

పేదలకు బియ్యం, నిత్యావసరాలు 
జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు కరోనా బారిన పడ్డ పేద కుటుంబాలకు, మృతుల కుటుంబాలకు 25 కేజీల బియ్యంతో పాటు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 80 కుటుంబాలను ఈ విధంగా ఆదుకున్నారు.

సరి లేరు నారీ సేన కెవ్వరు.. 
కోవిడ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారికి నారీ సేన సేవలందిస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన 50 మంది మహిళలు.. కోవిడ్‌ నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉండే వారికి భోజనం ప్యాకెట్లు పంపిస్తున్నారు. ఆహారం, గుడ్లు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో కూడిన ప్యాకెట్లు మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా డెలివరీ బాయ్‌తో పంపిస్తున్నారు. కోవిడ్‌ వచ్చిన వారు వారి పాజిటివ్‌ రిపోర్టుతోపాటు, వారి అడ్రస్, లొకేషన్‌ను వాట్సాప్‌ (8919823042) ద్వారా పంపిస్తే చాలు. 

ఇంట్లో వండి.. పేదలకు వడ్డిస్తూ 
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ప్రాంతంలోని పందిల్ల గ్రామానికి చెందిన వెల్దండి సదానందం వేములవాడలోని జాత్రాగ్రౌండ్‌ ప్రాంతంలో టీస్టాల్‌ నిర్వహిస్తున్నాడు. మిత్రుల సహకారంతో ప్రతిరోజూ రాజన్న గుడి ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న 30 మంది అభాగ్యులకు అన్నదానం 
చేస్తున్నాడు.

 ‘స్వాస్‌’.. మేము సైతం 
2010లో పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వాస్‌ సంస్థకు చెందిన 18 మంది మంచిర్యాలలో కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. గత రెండు రోజులుగా మంచిర్యాల, వేంపల్లి, నస్పూర్, క్యాత్వన్‌పల్లి, రామకృష్ణాపూర్‌ ఏరియాల్లోని దాదాపు 60 మందికి ఉచితంగా మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని వారి ఇళ్లకే తీసుకెళ్లి అందజేస్తున్నారు. ఆహారం అవసరమైన కోవిడ్‌ రోగులు 98662 88950 (స్వరాజ్‌), 8897939118 (వెంకటేశ్‌), 9573358625 (అనిల్‌), 9703175826 (కిరణ్‌) నంబర్లకు తమ చిరునామా, ఇతర వివరాలు వాట్సాప్‌లో పంపిస్తే చాలు.

ఆదర్శం .. అజార్‌ బాయ్‌ బృందం 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన ఎస్‌కే అజార్‌ బృందం కూడా అన్నీ తామై ముస్లిం, హిందూ, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ శభాష్‌ అన్పించుకుంటున్నారు. ఏప్రిల్‌ 30 నుంచి ఇప్పటివరకు 23 మృతదేహాలకు అజార్‌ (ఫోన్‌: 9550077229) ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహించాడు. అజార్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ఇప్పుడు కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అజార్‌తో కలసి ఆయన మిత్ర బృందం పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

అంతర్గాం మండల పరిధిలోని టీటీఎస్‌ అంతర్గాం గ్రామ సర్పంచ్‌ కుర్ర వెంకటమ్మ తన గ్రామంలో హోం క్వారెంటైన్‌ లో ఉన్న బాధితుల ఇళ్లకు వెళ్లి ఐదు వందల నగదు, పండ్లు అందజేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. 
నిత్యాన్నదానం 
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో భూమి స్వచ్ఛంద సంస్థ పేరుతో కొందరు యువకులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి ఇళ్లల్లో ఉన్నవారు, కాలినడకన వెళ్తున్న వలస కూలీలు, ఆస్పత్రిలో రోగులకు దాదాపు 20 మందికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. గత నెల రోజులుగా వారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

సహారా యూత్‌ కూడా.. 
నిర్మల్‌కు చెందిన సహారా యూత్‌ కూడా తమ వంతు సేవలు అందిస్తోంది. 57 మందితో కూడిన ఈ గ్రూప్‌ సభ్యులు.. బాసర మండలం కిర్గుల్‌(కె), బిద్రెల్లి, ముథోల్‌ మండలం రాంటెక్‌ గ్రామాల్లో కరోనాతో చనిపోయిన అనేకమందికి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ముందుకురాని సమయాల్లో సహారా యూత్‌ అక్కడికి వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేస్తోందని సహారా యూత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్‌ వాజిద్‌ అలీ చెప్పారు. 

ప్లాస్మాతో ప్రాణం పోస్తున్నారు 
వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన యువకులు ‘మేము ఉన్నాము’అనే ఒక వాట్సాప్‌ గ్రూపు (ఫోన్‌ నం:9133645435) క్రియేట్‌ చేసుకుని ఆరేళ్లుగా ఎవరికి అవసరమైనా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రక్తదానం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన వారికి కోవిడ్‌ నుంచి కోలుకున్న గ్రూప్‌ సభ్యులు ఉచితంగా ప్లాస్మా కూడా ఇస్తున్నారు. శ్రీపతి కిషోర్‌ అనే గ్రూప్‌ సభ్యుడు నెల వ్యవధిలో రెండుసార్లు ప్లాస్మా ఇచ్చాడు. ఇతనితో పాటు నల్లబెల్లి మండల కేంద్రానికే చెందిన యువకులు పున్నమాచారి, పున్నం కిరణ్, కారంపొడి శశికుమార్, అనుముల నితీష్‌ కుమార్‌లు ఈ విధంగా రక్తం, ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా  నిలుస్తున్నారు.

70 యూనిట్ల ప్లాస్మా దానం 
కామారెడ్డి రక్తదాతల సమూహం (బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌)లోని సభ్యులు.. బాలు అనే వ్యక్తి ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా 70 యూనిట్ల ప్లాస్మా దానం చేశారు. అలాగే గత 12 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు 7 వేలకు పైగా యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఎవరైనా సరే రక్తం అవసరం ఉందని మెసేజ్‌ (ఫోన్‌  నం: 9492874006) చేస్తే చాలు సభ్యులు స్పందిస్తారు.

తామే ఆ నలుగురై.. 
కరోనా మృతులకు అంతిమ సంస్కార సమయంలో తమకు వైరస్‌ సంక్రమిస్తుందనే ఆందోళనతో అయినవాళ్లు సైతం అంత్యక్రియలకు ముందుకు రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తామున్నామంటూ ముందుకొస్తోంది.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సొసైటీ. జిల్లా కేంద్రానికి చెందిన అఫాన్‌  తబ్రేజ్, ఫరీద్, రఫీక్, అస్లాంతో పాటు భానుచందర్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ పేరిట సమూహంగా ఏర్పడ్డారు. కరోనా మృతులకు ధైర్యంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల బంధువుల సంప్రదాయాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థలో ఏ సభ్యుడికైనా సరే ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తే తక్షణం అందుబాటులోకి వస్తారు. 
ఇవీ ఫోన్‌ నంబర్లు: ఆఫాన్‌ – 90103 27860, భాను – 98663 32139, తబ్రేజ్‌ – 98662 46460 , ఫరీద్‌ 94414 95050, రఫీఖ్‌ – 81065 07123, అస్లాం – 98859 75566

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top