ఏం తమాషా చేస్తున్నావా.. నిన్నెందుకు సస్పెండ్‌ చేయకూడదో చెప్పు? 

Vikarabad Collector Nikhila Serious On Mominpet Panchayat Secretary - Sakshi

ఎన్కేపల్లి పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌ ఫైర్‌

మెమో జారీ చేయాలని ఎంపీడీఓకు ఆదేశం

పనిచేయని వారిపై వేటు తప్పదని హెచ్చరిక 

సాక్షి, మోమిన్‌పేట: ‘ఏం తమాషా చేస్తున్నావా.. నిన్ను ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో చెప్పు’..? అంటూ కలెక్టర్‌ నిఖిల పంచాయతీ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబ్‌ చార్ట్‌ ప్రచారం నీ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని తేలిపోయిందని మండిపడ్డారు. గ్రామంలో చేపట్టే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులను దగ్గరుండి చేయించాల్సిన బాధ్యత సెక్రటరీలదేనని స్పష్టంచేశారు. కలెక్టర్‌ నిఖిల శుక్రవారం  ఎన్కేపల్లిలో పర్యటించారు.

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కృష్ణచైతన్యరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితవాడలో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు.  శ్మశానవాటికకు గోడ నిర్మించాలని, ఇందుకు అవసరమైన నిధులు తానే ఇస్తానని సర్పంచ్‌ అంతమ్మకు హామీ ఇచ్చారు. కబ్రస్థాన్‌కు వెళ్లే మార్గం పాడవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ముస్లింలు కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆమె రోడ్డును పరిశీలించి, నివేదిక అందజేయాలని ఎంపీడీఓ శైలజారెడ్డిని ఆదేశించారు. 

చర్యలతో బాధ్యతలు గుర్తుచేస్తా.. 
అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. తాను జనగాం జిల్లాలో పనిచేసినప్పుడు మొదట కార్యదర్శులు ఇలానే ప్రవర్తించారని.. పనిలో ఆలసత్వం ప్రదర్శించిన నలుగురిపై వేటు వేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇక్కడ కూడా కార్యదర్శులు బాధ్యతగా పని చేయడం లేదని అసహనం వ్యక్తంచేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే బాధ్యతలు గుర్తొస్తాయని తెలిపారు. 

సెక్రటరీలు ఉదయం ఆరు గంటలకే గ్రామాల్లో 
ఉండాలని సూచించారు. ధర్నాలకు భయపడేది లేదని, ఎవరిపని వారు చేస్తే సమస్యలేవీ ఉండవన్నారు. కార్యదర్శుల పని కేవలం లైట్లు, నీళ్లు, మురుగు కాల్వలే కాదని, ఉపాధి పనులు సైతం పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. నూతన చట్టంలో కార్యదర్శుల జాబ్‌కార్డు పూర్తిగా పొందిపర్చినట్లు వివరించారు. కృష్ణచైతన్యరెడ్డికి వెంటనే మెమో జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. 15 రోజుల్లో మళ్లీ వస్తానని, గ్రామంలో పరిస్థితులు మారకపోతే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు.

ఎన్కేపల్లిలో రిజిస్టర్లను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ నిఖిల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top