డిగ్రీతో ‘దోస్త్‌’ అంతంతే | vacant degree seats in Telangana | Sakshi
Sakshi News home page

డిగ్రీతో ‘దోస్త్‌’ అంతంతే

Jul 8 2025 12:36 AM | Updated on Jul 8 2025 12:36 AM

vacant degree seats in Telangana

డిగ్రీ కోర్సుల్లో  ఉన్న సీట్లు 4.6 లక్షలు... ఇప్పటి వరకు 1.41 లక్షలే భర్తీ

మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి

ఏటా 2.20 లక్షలు దాటని వైనం

బీకాం, బీఎస్సీ ఓకే.. సంప్రదాయ కోర్సులకు అంతంతే

దోస్త్‌ ప్రవేశాల డేటా విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

సాక్షి, హైదరాబాద్‌ : డిగ్రీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటోంది. రాష్ట్రంలో 957 డిగ్రీ కాలేజీల్లో  4,36,947 సీట్లు అందుబాటులో ఉంటే, మూడు విడతల దోస్త్‌ కౌన్సెలింగ్‌ తర్వాత కూడా చేరిన వారి సంఖ్య 1,41,590 మాత్రమే. కనీసం సగంమంది కూడా చేరలేదు. ఇప్పటి వరకూ దోస్త్‌లో చేరిన విద్యార్థుల సంఖ్యను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి సోమ వారం మీడియాకు విడుదల చేశారు.

ఏటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని దశల కౌన్సెలింగ్‌ పూర్తయ్యేనాటికి 2.20 లక్షల మంది మాత్రమే చేరుతున్నారు. ప్రైవేట్‌ కాలేజీల్లో చేరేవారి సంఖ్య 37 శాతం మించడం లేదు. గ్రామీణ ప్రాంతాల కాలేజీల్లో అతి తక్కువ మంది చేరుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్‌ జిల్లాల్లో ఉన్న కాలేజీల్లో కొంతమేర సీట్లు భర్తీ అవుతున్నాయి. డిగ్రీ చదివే విద్యార్థులు పార్ట్‌ టైం పనిచేసుకునేందుకు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అవకాశాలుంటున్నాయి. దీంతోపాటు డిగ్రీ తర్వాత ఉపాధి పొందే స్కిల్‌ కోర్సులు నేర్చుకునేందుకు రాజధాని వేదికగా మారింది.

బీకాం వైపే విద్యార్థుల చూపు
ఇప్పటి వరకూ దోస్త్‌ ద్వారా ఎక్కువ మంది బీకాం కోర్సులోనే చేరారు. 1,41,590 మంది వివిధ కోర్సుల్లో చేరితే, ఇందులో అత్యధికంగా బీకాంలో 54,771 మంది చేరారు. ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌లో 27,059 మంది చేరారు. బీఏ కోర్సులో 60,414 సీట్లు ఉంటే, చేరిన విద్యార్థులు 19,104 మాత్రమే. ఇటీవల కాలంలో బీబీఏ కోర్సుకు కొంత ఆదరణ పెరిగింది. ఈ కోర్సులో 11,462 మంది చేరారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు కంప్యూటర్‌ కాంబినేషన్‌ ఉన్న కోర్సులకు మాత్రం విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఈ పరిస్థితికి కారణమేంటి?
దశాబ్దాల క్రితం సంప్రదాయ డిగ్రీ కోర్సులే ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కాలేజీలు, సీట్ల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు. అయితే, మార్కెట్‌లో వస్తున్న మార్పులను మాత్రం ఉన్నత విద్యామండలి గుర్తించడం లేదు. కోర్సుల ఆడిట్‌ చేపడితే ఏయే కోర్సులు అవసరమనేది అర్థమవుతుంది. డిగ్రీ తర్వాత ఉపాధి పొందాలన్నా నైపుణ్యం ముఖ్యం. ఆ దిశగా కోర్సుల సిలబస్‌ తీర్చిదిద్దుతామని మండలి అనేక ప్రయత్నాలు చేసింది. ఇది పెద్దగా ముందుకు పోలేదు. కొన్నేళ్లుగా> డిగ్రీలో 2.20 లక్షల మందికి మించి చేరడం లేదు. అలాంటప్పుడు 4.60 లక్షల సీట్లు ఎందుకు? ఏ కోర్సులు అవసరం లేదు? అనే దిశగా ఉన్నతవిద్య విభాగం ఆలోచించడం లేదు.  

రీ డిజైన్‌ చేస్తాం  
కాలానుగుణంగా విద్యావ్యవస్థ లోనూ మార్పులు వస్తున్నాయి. డిగ్రీ చదివిన ప్రతీ విద్యార్థి నైపుణ్యంతో ఉపాధి పొందాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకూ ఈ దిశగా జరిగిన కసరత్తు తక్కువే. వచ్చే ఏడాది నుంచి డిమాండ్‌ కోర్సులు, వాటిల్లో అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకొచ్చే దిశగా ఉన్నత విద్యామండలి ప్రయత్నించాలనే లక్ష్యంతో ఉంది. –  ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌

ఆదరణలేని కోర్సులతో ఉపయోగం ఏమిటి?  
చాలా కోర్సులకు దశాబ్ద కాలంగా ఆదరణ తగ్గింది. కొన్ని కాలేజీల్లో కొన్ని కోర్సుల్లో ఐదారుగురు కూడా చేరే పరిస్థితి ఏర్పడింది. బీకాం,  బీఎస్సీ, లైఫ్‌సైన్స్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కోర్సులపై ఉన్నత స్థాయిలో సమీక్ష జరగాలి. అవసరం లేని కోర్సులు తగ్గించాలి. డిమాండ్‌ ఉన్నవి పెంచాలి. అప్పుడే సమతుల్యత సాధ్యం. – వేదుల శాంతి, కేశవ మెమోరియల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement