ఇతర రాష్ట్రాల్లో ఇదే పద్ధతి అమలు.. రెండుసార్లు సవరిస్తే మార్కెట్ విలువల దగ్గరకు
తాజా సవరణ కోసం ఈ నెల 23 లేదా 25న జిల్లా స్థాయిలో సమావేశాలు
వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి
గ్రామాల వారీగా వ్యవసాయ భూముల విలువలను సర్వే నంబర్ల వారీగా సిద్ధం చేస్తున్న అధికారులు
తాజా పెంపుతో ఏటా రూ.1,200–1,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: భూములు, ఆస్తుల విలువలను ఏటా సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఇదే పద్ధతి అమల్లో ఉన్నందున, మన దగ్గరా ఏటేటా విలువలను సవరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ చేసిన సిఫారసులు కూడా దీన్ని బలపరుస్తుండడంతో త్వరలోనే సవరించనున్న విలువలను భారీ స్థాయిలో పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ఏటా సవరించే విధానాన్ని అమల్లోకి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
రాష్ట్రంలో విలువలను సవరించి నాలుగేళ్లు దాటడంతో పెద్దఎత్తున కసరత్తు చేసి ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తోందని, తద్వారా ప్రజలపై భారం పడుతుందనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని, అదే ఏటా సవరిస్తే ప్రజలపై భారం పడినట్టు కూడా ఉండదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న విలువలను మరో రెండుసార్లు సవరిస్తే బహిరంగ మార్కెట్ విలువలకు దాదాపు సరితూగే విధంగా రిజిస్టర్ విలువలు కూడా చేరుతాయని, ఆ తర్వాత పెంపు చాలా స్వల్పంగా ఉంటుందని అంటున్నారు.
ఎక్కువ, తక్కువ కాకుండా
ఈనెల 26 లేదా 28వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్న భూములు, ఆస్తుల కొత్త విలువల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,200–1,500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయగా, ప్రస్తుతం భూభారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల అప్‌లోడింగ్ ప్రక్రియ జరుగుతోంది.
గ్రామాల వారీగా నిర్ధారించిన విలువలను ఇప్పుడు సర్వే నంబర్ల వారీగా విభజించే పనిలో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఈనెల 23 లేదా 25 తేదీల్లో జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త విలువలకు కమిటీల ఆమోదం తీసుకోనున్నారు. ఈ సమావేశాలు జరిగిన దాన్ని బట్టి ఈ నెల 26 లేదా 28వ తేదీ నుంచి కొత్త విలువలను అమల్లోకి తేనున్నారు.
ఆ రెండు విలువలు.. పెద్దగా మార్పు లేనట్టే
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్న కొత్త విలువలను పరిశీలిస్తే..వ్యవసాయ భూములు, అపార్ట్‌మెంట్ల విలువలను పెద్దగా సవరించడం లేదని తెలుస్తోంది. ఈ రెండు కేటగిరీల్లో గరిష్ట విలువలు గతంలో మాదిరిగానే ఉంటాయని సమాచారం. వ్యవసాయ భూముల కనిష్ట విలువను కూడా 100 శాతం పెంచడం లేదని సమాచారం. ఇక, అపార్ట్‌మెంట్లకు ఇప్పుడు కనీస ధర చదరపు అడుగుకు రూ.1,300 ఉండగా, దాన్ని రూ.1,600కు పెంచుతున్నారు.
ఇక, గరిష్టంగా ఉన్న రూ.7,500 విలువను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇక, ఓపెన్‌ప్లాట్ల విషయంలో గరిష్ట విలువ ప్రస్తుతం రూ.93 వేలు ఉండగా, దాన్ని రూ.1.20 లక్షలకు లోపుగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జరిగే మార్పుల ద్వారా అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లలో పెద్దగా ఆదాయంలో మార్పు ఉండదని, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల మధ్యస్త విలువల పెంపు ద్వారానే అదనపు ఆదాయం సమకూరుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.


