
సభ్యత్వం పేరుతో వసూలు చేసిన పైసల లెక్కలన్నీ తీస్తా
చైనాతో సంబంధాలు మెరుగుపర్చినా మోదీకి థ్యాంక్స్ చెప్పరా?
గ్రానైట్ వ్యాపారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చురకలు
కొత్తపల్లి (కరీంనగర్): గ్రానైట్ వ్యాపారులు గత 20 ఏళ్లుగా బీఆర్‌ఎస్ పార్టీకి దోచిపెడుతూనే ఉన్నారని, ఇలా ఇంకెన్నాళ్లు దోచిపెడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఒక్కో గ్రానైట్ కటింగ్ మిషన్ ఇండస్ట్రీ నుంచి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలదాకా.. దాదాపు 350 నుంచి 500 షాపుల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని, ఆ సొమ్మును ఏం చేశారో చెప్పాలని అన్నారు.
గ్రానైట్ వ్యాపారుల నుంచి రూ.వెయ్యికోట్లు తీసుకున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేసినా ఎవరూ ఖండించలేదని వ్యాపారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియెజకవర్గంలోని మానకొండూర్, చింతకుంటలో గురువారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సంజయ్‌కు పలువురు గ్రానైట్ వ్యాపారులు ఎదురుపడ్డారు.
ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లొచ్చాక ఆ దేశంతో వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని అసోసియేషన్ నేతలు చెప్పగా.. సంజయ్ స్పందిస్తూ కనీసం ప్రెస్‌మీట్ పెట్టి మోదీకి థ్యాంక్స్ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అంటూ నిలదీశారు. 20 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌కు దోచిపెడుతూనే మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటుండగా.. మరికొందరు రాజకీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటూ ఆ సొమ్ముతో రాజకీయాలు చేస్తూ.. మాలాంటోళ్లను ఓడగొట్టాలని చూస్తార ని చురకలంటించారు.
గ్రానైట్ అసోసియేషన్ కేంద్రానికి చెల్లించింది రూ. 300 కోట్లకు మించి లేదని, కానీ రూ.వెయ్యి కోట్లు ఇచి్చనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహించారు. ఎవ్వరికీ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని కల్పిస్తానని, సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలని సంజయ్ సూచించారు.