భార్యను చెల్లి అని పిలవమన్నాడు.. ఆ తర్వాత.. | Twist In Case Of killing Ex Wife In Narayanaguda | Sakshi
Sakshi News home page

భార్యను చెల్లి అని పిలవమన్నాడు.. ఆ తర్వాత..

Published Wed, Nov 16 2022 7:43 AM | Last Updated on Wed, Nov 16 2022 7:43 AM

Twist In Case Of killing Ex Wife In Narayanaguda - Sakshi

హిమాయత్‌నగర్‌: తన భార్యను పెళ్లి చేసుకున్నదే కాకుండా ఆమెను చెల్లి అని పిలవాలంటూ ఆర్తీ రెండో భర్త నాగరాజు.. నాగులసాయిని బెదిరించాడు. ఈ నెల 7న నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్‌ వద్ద నాగులసాయిని అడ్డగించిన నాగరాజు తన భార్య ఆర్తీతో మాట్లాడినా, ఫోన్‌ చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఇకపై ఆమె నీకు చెల్లెలి వరుస అవుతుంది కాబట్టి చెల్లి అని పిలవాలని చెప్పాడు. ఈ కారణంతోనే తాను అతడిపై దాడి చేశానంటూ నిందితుడు నారాయణగూడ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మంగళవారం నిందితుడు నాగుల సాయిని రిమాండ్‌కు తరలించారు. 

ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్‌ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్‌ నాగులసాయి వృతి రీత్యా బ్యాండ్‌ వాయిస్తుంటాడు. బ్యాండ్‌ పని లేనప్పుడు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఇతని స్నేహితుడి ద్వారా చిక్కడపల్లికి చెందిన ఆర్తీ పరిచయమైంది. దీంతో 2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు, వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో వారు కొద్దిరోజుల వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్తీ అన్న జితేంద్రపై నాగుల సాయి దాడి చేసి ఏడాది పాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టు ధిక్కారం కేసులో మరో ఏడాది జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జితేంద్ర భార్య ఆర్తీకి నాగరాజును పరిచయం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు విష్ణు జన్మించాడు. మంటల్లో గాయపడిన విష్ణు దాడి మరుసటి రోజు చనిపోయాడు.  

గర్భంలో ఉన్న శిశువు మృతి.. 
అందర్నీ ఒకేసారి చంపాలనే ఉద్దేశంతో కుమారుడితో సహా ఇద్దరూ ఒకేచోట ఉన్నప్పుడు పెట్రోల్‌ పోశాడు. ఈ దాడిలో పది నెలల విష్ణు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగరాజు సైతం చనిపోగా.. సోమవారం రాత్రి ఆర్తి గర్భంలో ఐదు నెలల శిశువు మృతి చెందింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి  విషమంగా ఉందని గాంధీ వైద్యులు వెల్లడించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement