TS: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు.. ప్రిన్సిపల్‌ సంతకం లేకున్నా..

TS Intermediate Exams: No Need To Get Principal Signature On hall ticket - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డీఐఈవో ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 35,522 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ ఇస్తామంటున్న కళాశాలలపై కఠిన చర్యలు ఉంటాయని, విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రిన్సిపాల్‌ సంతకం లేకుండానే పరీక్షకు హాజరుకావచ్చని ఇంటర్‌ విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్‌ నిబంధనలతో పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధన అమల్లో ఉంది. ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, విద్యాశాఖ, పోస్టల్, ఇతరశాఖల కో–ఆర్డినేషన్‌తో పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 6 నుంచి ఇంటర్మీడియేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఐఈవో రఘురాజ్‌ ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. 

సాక్షి: ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
డీఐఈవో: ఇంటర్‌ బోర్డు ఆదేశాలు, జిల్లా ఉన్నతాధికారుల సలహాల, సూచనలతో పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొత్తం 35,522 మంది పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల్లో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 

►నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉందా 
గతంలో మాదిరిగానే నిమిషం నిబంధన అమ ల్లో ఉంటుంది. విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8 గంటల నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు రావాలి. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్‌ సెంటర్‌ లోకేటర్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా పరీక్షాకేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. 

►మాస్‌కాపీయింగ్‌పై పర్యవేక్షణ ఎలా ఉండనుంది
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నీడలో పరీక్ష పత్రాలను తెరవాలి. మాస్‌కాపీయింగ్, అవకతవకలు జరగకుండా చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్‌ అధికారి అందుబాటులో ఉంటారు. వీరితో పాటు జిల్లాలో డిపార్ట్‌మెంట్‌ అధికారి, డిప్యూటీ తహసీల్దార్‌ హోదాలోని రెవెన్యూ అధికారి, ఏఎస్సై హోదా కలిగిన ఒక పోలీసు అధికారితో కూడిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, నాలు గు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఏర్పాటుచేశాం. రాష్ట్ర స్థాయి తనిఖీ బృందాలూ తనిఖీలు చేపడతాయి. 

►ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకుంటున్న చర్యలు
పరీక్ష ముగిసేసరికి మధ్యాహ్నం అవుతుంది. ప్రతి కేంద్రం వద్ద టెంట్‌ వేయాలని చెప్పాం. తాగునీరు, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయా లు అందుబాటులో ఉంటాయి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటుంది. ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. 

విద్యార్థులు మానసిక ఒత్తిడి అధిగమించాలంటే..
పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వారి కోసం ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ సైక్రియార్టిస్ట్‌ను నియమించారు. 18005999333 నంబర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలంటే భయం ఉన్న విద్యార్థులు ఈ నంబర్‌కు ఫోన్‌చేసి ఒత్తిడిని జయించవచ్చు.

►హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు
హాల్‌టికెట్లు ఇవ్వని కళాశాలల యాజమా న్యాలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు ఉంటాయి. నోటీసులు కూడా జారీ చేస్తాం. కళాశాలలో హాల్‌టికెట్లు ఇవ్వకుంటే ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరుకావచ్చు. ఈవిషయంలో విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దు. 

►పరీక్షలు సజావుగా సాగేందుకు చర్యలు
పరీక్షలు సజావుగా జరిగేలా కలెక్టర్‌ సూచనల మేరకు అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రా కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించాం. పరీక్ష సమయానికి బస్సులు నడిచేలా చూడాలని ఆర్టీసీకి, విద్యుత్‌ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎస్‌ఈని, పోలీస్, డీఎంహెచ్‌వో, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించాం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top