రోజూ 50 వేలు.. వారానికోసారి లక్ష టెస్టులు

TS High Court Serious On Corona Tests Very Low Compared To Other States - Sakshi

కరోనా పరీక్షలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

వైరస్‌ నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహించడంపై అసంతృప్తి

ప్రజల్ని చీకట్లో ఉంచి అంతా బాగుందనడం సరికాదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌ : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉందని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయ పడింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రోజూ 50 వేలకు తగ్గకుండా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వారంలో ఒక రోజు లక్ష పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా నియంత్రణకు సంబంధించి దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ పిటిషన్లపై విచారణకు కేవలం 15 నిమిషాల ముందు ప్రభుత్వం కరోనా పరీక్షలకు సంబంధించి నివేదిక సమర్పించడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కనీసం ఒక రోజు ముందు నివేదిక సమర్పించాలని పలుమార్లు ఆదేశించినా ప్రభుత్వం వాయిదా కోరాలన్న కారణంగా ఇలా చివరి నిమిషంలో నివేదికలు సమర్పిస్తోందని మండిపడింది. ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ధర్మాసనం పేర్కొంది.

ప్రజలను చీకట్లో ఉంచి అంతా బాగుందనడం సరికాదని, రోగులు, మృతుల సంఖ్యకు సంబంధించి సరైన సమాచారం ప్రజలకు తెలియడం లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జర్మనీలో, తెలంగాణలో ఒకే తరహాలో పరీక్షలు చేస్తామంటే ఎలా అని, డబ్ల్యూహెచ్‌వో సూచనలు రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ఉండవని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం వినూత్నంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

విచారణకు ముందు పరీక్షల సంఖ్య పెంచుతున్నారు...
హైకోర్టులో ఈ పిటిషన్లు విచారణకు వచ్చే ముందు రెండు, మూడు రోజులు మాత్రమే పరీక్షల సంఖ్య 40 వేలకు పెంచుతున్నారని, ఇతర రోజుల్లో 20 నుంచి 25 వేలు మాత్రమే చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారీ సంఖ్యలో పరీక్షలు చేసి కరోనా రోగులను గుర్తిస్తే తప్ప కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకోవడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. ఢిల్లీ, కేరళలలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ వరద సాయం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మీ–సేవా కేంద్రాల వద్ద ప్రజలు భౌతికదూరం పాటించకుండా, మాస్కు లేకుండా గుమిగూడినా పోలీసుల జాడ కనిపించలేదని ధర్మసనం అసహనం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించేలా జారీ చేసిన జీవో 64ను కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది.

విపత్తు ప్రణాళిక లేనట్లుగా భావిస్తాం...
విపత్తు నివారణ ప్రణాళిక సమర్పించాలని 6 నెలల నుంచి కోరినా ప్రభుత్వం ఇవ్వడం లేదని, అటువంటి ప్రణాళిక ఏదీ లేదని భావించి తీర్పు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ప్రణాళిక ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పగా అది రహస్యమన్నట్లుగా మీ జేబులో పెట్టుకుంటే ఎలా తెలుస్తుందని, కోర్టుకు సమర్పించాలని ఐదు పర్యాయాలుగా ఆదేశిస్తూనే ఉన్నామంటూ అసహనం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో స్పష్టంగా పేర్కొనలేదంటూ మండిపడ్డ ధర్మాసనం.. కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అయితే ఈ నెల 24లోగా నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top