ఏటూరునాగారంలో పులి!

Tiger In Eturnagaram Forest area - Sakshi

టైగర్‌ రిజర్వ్‌లకు వెలుపలి కొత్త ప్రాంతాల్లో సంచారం..

రాష్ట్రంలో పెద్ద టైగర్‌ రిజర్వ్‌లతో అనువైన పరిస్థితులు..

వంద పులులకు వీటిల్లో అవకాశముందన్న అధికారులు

ఇటు తిప్పేశ్వర్, తడోబా, ఇంద్రావతిల నుంచి పెరిగిన వలసలు

తాజా పులుల గణాంకాలపై పర్యావరణవేత్తల అభ్యంతరాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు, కదలికలు రికార్డయ్యాయి. టైగర్‌ రిజర్వ్‌లకు ఆవల కొత్తగా మరో అడవిలో పులి కనిపించడం, అక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించడం ఒక శుభపరిణామంగా అటవీశాఖ అధికారులు, పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ఏటూరునాగారంతో పాటు కిన్నెరసాని, పాకాల అటవీ ప్రాంతాల్లోనూ పులులు స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు అనువైన పరిస్థితులున్నాయని పర్యావరణవేత్తలు వెల్లడించారు. రాష్ట్రంలో మెరుగైన అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటు సువిశాల దట్టమైన అడవి, తగిన సంఖ్యలో వివిధ రకాల జంతువులు, నీటి వనరులు అందుబాటులో ఉండటం పులులు ఆవాసాలు ఏర్పరచుకోవడానికి, వాటి సంఖ్య వృద్ధి చేసుకునేందుకు అనువుగా ఉన్నట్టుగా ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వైల్డ్‌ లైఫ్‌ ఓఎస్డీ ఎ.శంకరన్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

పెద్ద టైగర్‌ రిజర్వ్‌లతో అనువైన పరిస్థితులు.. 
దేశంలో 50 టైగర్‌ రిజర్వ్‌లుండగా, వాటిలో 2 వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న 4, 5 అభయారణ్యాల్లో.. ఏపీలోని నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) 3,728 చ.కి.మీ.లలో, తెలంగాణలోని ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) 2,611 చ.కి.మీ, మరో పులుల అభయారణ్యం కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ (కేటీఆర్‌) 2,016 చ.కి.మీ.లలో విస్తరించి ఉన్నాయి. ఒక పులి స్వేచ్ఛగా తిరిగి, తన జీవనాన్ని సాగించేందుకు 50 చ.కి.మీ. అడవి అవసరమవుతుంది. దీనిని బట్టి తెలంగాణలోని ఏటీఆర్, కేటీఆర్‌లతో పాటు ఇతర అనువైన అటవీ ప్రాంతాలు కలుపుకుని 5 వేల చ.కి.మీ. పైగానే దట్టమైన అటవీ విస్తీర్ణం ఉన్నందున ఇక్కడ వంద దాకా పులుల స్థిరనివాసం ఏర్పరుచుకునేందుకు అవకాశముందని శంకరన్‌ తెలిపారు. ఇప్పటివరకు పులులు లేని కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం వంటి కొత్త ప్రదేశాల్లోనే 5 నుంచి 10 దాకా పులులు జీవనం సాగించేందుకు అనువైన పరిస్థితులున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో మనుషుల జీవనాధారం పులుల భద్రత పరిరక్షణతోనే ముడిపడి ఉండబోతోందని, పులులు తమ తమ ఆవాసాల్లో సంతోషంగా జీవిస్తేనే, మనుషులు కూడా ఆనందమయ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందని శంకరన్‌ వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పులి మీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉన్నందున పులుల మనుగడ అనేది మానవాళి కొనసాగేందుకు కూడా ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. 

తాజా నివేదికపై అభ్యంతరాలు.. 
రాష్ట్రంలో 26 పులులున్నట్టుగా గతేడాది విడుదలైన టైగర్‌ సెన్సెస్‌ రిపోర్ట్‌–2018లో వెల్లడైంది. మంగళవారం ‘స్టేటస్‌ ఆఫ్‌ టైగర్స్‌ అండ్‌ కోప్రిడేటర్స్‌ అండ్‌ ప్రే ఇన్‌ ఇండియా–2018’పేరిట కేంద్ర అటవీ పర్యావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్‌లోనూ తెలంగాణలో 26 పులులున్నట్టు పేర్కొన్నారు. అయితే కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో పులుల సంఖ్య తక్కువగా చూపడం, ఇతర అటవీ ప్రాంతాల్లోనూ పులులకు ఆహారంగా ఉపయోగపడే జంతువుల సంఖ్య తక్కువగా పేర్కొనడం పట్ల హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసైటీ కో ఫౌండర్‌ ఇమ్రాన్‌ సిద్ధిఖీ అభ్యంతరం తెలిపారు. తాజా నివేదికలో రాష్ట్రంలోని టైగర్‌ రిజర్వ్‌ల్లోని పులుల లెక్కింపు, ఇతర అంశాల పరిశీలన అసమగ్రంగా ఉందని, కొన్ని విషయాల్లో స్పష్టత లోపించిందని తెలిపారు. తెలంగాణలోని 2 పులుల అభయారణ్యాల్లో మెరుగైన పరిస్థితులున్నాయని అందువల్ల గతంలో అంచనా వేసిన 26 కంటే కూడా ఎక్కువగానే పులుల సంఖ్య ఉంటుందనే విశ్వాసాన్ని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇమ్రాన్‌ తెలిపారు. పులుల ఆవాసాల ద్వారా పర్యావరణ పరంగా అందుబాటులోకి వచ్చే సేవలను డబ్బు పరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ.250 కోట్ల విలువ చేస్తుందన్నారు. కోవిడ్‌ సంక్షోభం మనందరికీ ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులను గౌరవించి, కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఒక హెచ్చరికగా తెలియజేసిందని చెప్పారు. 

పొరుగు రాష్ట్రాల నుంచి వలసలు.. 
తెలంగాణలోని టైగర్‌ రిజర్వ్‌ల్లో పులుల వృద్ధికి అనుకూల పరిస్థితులతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాల్లోంచి రాష్ట్రంలోకి పులుల వలసలు పెరుగుతున్నాయి. తడోబా, తిప్పేశ్వర్‌లలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అక్కడ చోటు సరిపోక, ఇంద్రావతిలో సానుకూల వాతావరణం లేక తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగిన సంఖ్యలో జంతువులు, నీటివనరులు వంటివి ఉండటంతో ఇక్కడకు వస్తున్నట్టుగా అటవీ, పర్యావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top