ధర లేకుండా టెండర్‌! | Tenders Floated for Uniforms and Other Supplies Without Announcing Minimum Prices | Sakshi
Sakshi News home page

ధర లేకుండా టెండర్‌!

May 4 2026 6:29 AM | Updated on May 4 2026 6:29 AM

Tenders Floated for Uniforms and Other Supplies Without Announcing Minimum Prices

చర్చనీయాంశమవుతున్న గురుకుల అధికారుల తీరు

కామన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో సేకరించాలని సర్కారు నిర్ణయం 

యూనిఫామ్‌లు, బూట్లు తదితరాలకు కనీస ధరలు ప్రకటించకుండా టెండర్లు 

కాంట్రాక్టర్లు ఏకమై ఇష్టానుసారంధరలు కోట్‌ చేశారనే ఆరోపణలు 

ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుతుందనే విమర్శ 

గురుకులాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో మొత్తం 9,24,107 మంది విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్, హాస్టల్‌ విద్యార్థులకు విద్యా సంవత్సరంలో అవసరమయ్యే వస్తువులను కామన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ (డీపీసీ)ల ద్వారా టెండర్లు ఖరారు చేయగా.. ఈసారి రాష్ట్రస్థాయిలో ఒకే గొడుగు కింద కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నాణ్యత, సమయపాలన, సులభతర పర్యవేక్షణలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఈ టెండర్ల ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను ఏర్పాటు చేస్తూ ఎస్సీ గురుకుల సొసైటీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.

అయితే ఎలాంటి ధరను ప్రకటించకుండా టెండర్లు పిలిచిన అధికారులు..గత నెల 17వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. ఇప్పటికే సాంకేతిక బిడ్లను పరిశీలించి అర్హత పొందిన కాంట్రాక్టర్లను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఆర్థిక బిడ్‌లో కాంట్రాక్టర్లు పేర్కొన్న ధరలను ప్రస్తుతం పీఎంయూ సమీక్షిస్తోంది. సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పీఎంయూ సభ్యులైన సంక్షేమ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు, గురుకుల సొసైటీల కార్యదర్శులు, విద్యాశాఖ కమిషనర్‌ల ఆధ్వర్యంలో ఈ కసరత్తు కొనసాగుతోంది. అతిత్వరలో టెండర్లు ఖరారు చేసి, న్యాయశాఖ అనుమతి తీసుకున్న తర్వాత కాంట్రాక్టర్లకు వర్క్‌ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా ధర ప్రకటించకుడా టెండర్లు పిలవడం చర్చనీయాంశమయ్యింది.  

ఏయే విద్యాసంస్థలు.. 
కామన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో దాదాపు పది రకాల విద్యాసంస్థలున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎంఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఆర్‌ఈఐఎస్‌), కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు వీటిలో ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 9,24,107 మంది విద్యార్థులున్నట్లు అధికారులు అంచనా వేశారు.  

ఏయే వస్తువులు... 
కామన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ఈ 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, సాక్స్, బ్యాగ్, నోటు పుస్తకాలు, ట్రంకు పెట్టెలు, రగ్గులు, దుప్పట్లు, మ్యాట్, పీటీ డ్రెస్, నైట్‌ డ్రెస్, ట్రాక్‌ సూట్, ట్రాలీబ్యాగ్స్, ఐడీ కార్డు, స్టేషనరీ కిట్‌ తదితర 22 రకాల వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. 

ధర ఏది మరి? 
ఆయా వస్తువుల నాణ్యత, పరిమాణం తదితర పూర్తి వివరాలు, పక్కా కొలతలతో కూడిన డిమాండ్‌ను టెండర్‌లో పొందుపర్చారు. కానీ ఆయా వస్తువులకు సంబంధించి కనీస ధరను మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. సాధారణంగా టెండర్‌లో ఒక ధరను నిర్దేశించి అందుకు అనుగుణంగా బిడ్‌లు స్వీకరిస్తారు. తర్వాత అందులో తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు. కానీ అధికారులు భారీఎత్తున వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. టెండర్‌ పత్రాల్లో ఎక్కడా ప్రాథమిక ధరలు స్పష్టం చేయలేదు. దీన్ని ఆసరా చేసుకున్న కాంట్రాక్టర్లు ఏకమై ఇష్టమొచి్చన ధరలతో బిడ్లు సమర్పించారనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక కాంట్రాక్టర్లకు చెక్‌ 
గతంలో డీపీసీల కాంట్రాక్టర్లను ఎంపిక చేసినప్పుడు దళితులు, గిరిజనులకు 25 శాతం కోటా ఉండేది. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు ఇది ఒక మంచి అవకాశంగా ఉండేది. కానీ ప్రస్తుత విధానంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకించి రిజర్వేషన్లను ప్రస్తావించలేదు. కానీ టెండరు ప్రక్రియలో పాల్గొనే కాంట్రాక్టర్‌ సాల్వెన్సీ సరి్టఫికెట్‌ (ఆర్థిక బలనిరూపణ) సమరి్పంచాలనే నిబంధన విధించారు. నోట్‌బుక్స్‌ టెండర్‌లో పాల్గొనే కాంట్రాక్టర్‌ రూ.40 కోట్ల, పీటీ డ్రెస్, నైట్‌ డ్రెస్, ట్రాక్‌ సూట్ల కాంట్రాక్టర్‌ రూ.25 కోట్ల మేర, స్కూల్‌బ్యాగ్, షూ, సాక్స్, టై, బెల్ట్‌ పంపిణీ చేసే కాంట్రాక్టర్‌ రూ.50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్‌ సమరి్పంచాలి. 

అలాగే ఐడీకార్డ్‌ హోల్డర్, స్టేషనరీ కిట్‌ కాంట్రాక్టులో రూ.20 కోట్ల మేర, ట్రాలీ బ్యాగ్‌ కాంట్రాక్టుకు సంబంధించి రూ.2 కోట్లు, ట్రంక్‌బాక్స్‌ కాంట్రాక్టుకు సంబంధించి రూ.10 కోట్ల మేర, యూనిఫామ్‌ క్లాత్‌ కాంట్రాక్టులో రూ.25 కోట్ల సాల్వెన్సీ సరి్టఫికెట్‌ సమరి్పంచాలి. ఇలా ప్రతి కేటగిరీలోనూ కోట్ల రూపాయలమేర కమర్షియల్‌ బ్యాంకుల నుంచి సాల్వెన్సీ సరి్టఫికెట్లు సమర్పించడం ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు సాధ్యమయ్యే విషయం కాదు. మరోవైపు రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ, ఎస్‌ఎంఈలకు సైతం అత్యంత కష్టసాధ్యం కావడంతో వీరంతా ఈ కామన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కాంట్రాక్టుకు దూరంగా ఉండిపోయారు. వస్తువుల ధరలకు సంబంధించి వివరణ కోరేందుకు పీఎంయూలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్‌ సెక్రెటరీని సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయతి్నంచగా ఆయన అందుబాటులోకి రాలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement