
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్ర గ్రహణం ముగిసింది. భారత్‌లో కూడా అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. అనంతరం సోమవారం తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. సుమారు 12 గంటల అనంతరం మహా ద్వారం తెరిచారు. గ్రహణం వీడటంతో ఆలయ శుద్ది, పుణ్యాహవచనం చేశారు అర్చకులు. అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనం ప్రారంభమై కొనసాగుతోంది.
ఇటు, తెలంగాణలో వేములవాడ రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా దాదాపు 10 గంటలపాటు ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం ముగియడంతో తెల్లవారుజామున 3:45 నిమిషాలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసిన అర్చకులు ఆలయాన్ని తెరిచారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి చుట్టూ కోడెను తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 గంటల నుండి యథావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇక, భద్రాచలంలో ఉదయం 7.30 నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉండగా.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా రాత్రి 11.01 గంటల నుంచి అర్ధరాత్రి 12.23 గంటల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షికంగా చంద్ర గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక పూర్తి గ్రహణం వీడింది.
