మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు

Telengana women journo workshop:Rs 5 lakhs announced by Minister Satyavathi Rathod - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్‌ శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఏప్రిల్‌ 23, 24(శని, ఆది) రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలను తెలంగాణా ప్రెస్‌ అకాడెమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ  ప్రారంభించారు. 

హైదరాబాద్‌ బేగంపేట, ప్లాజా హోటల్‌లో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో తొలి రోజు మొదటి సెషన్‌కు జర్నలిసులు స్వేచ్ఛ, సుమబాల అధ్యక్షత వహించారు.  రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్,  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి హాజరైనారు. 

తెలంగాణా ఏర్పడిన తరువాత తొలిసారి మహిళా జర్నలిస్టుల కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇది సంతోషదాయక మని అల్లం నారాయణ వెల్లడించారు. మహిళా జర్నలిస్టుల అస్థిత్వం కోసం, వారికి  ఒక స్పేస్‌ను కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. వివిధ అంశాలపై సీనియర్‌ పాత్రికేయుల ప్రసంగాలతోపాటు, మహిళలుగా మీడియాలో ఎదురవుతున్న కష్టనష్టాలను పంచుకునే కలబోత కార్యక్రమం కూడా ఉందని అల్లం నారాయణ వెల్లడించారు. ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, అలాగే ఆయా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారంకోసం కృషి  చేద్దామని పిలుపునిచ్చారు. 

మహిళా జర్నలిస్టులకోసం రూ. 5 లక్షలు
రాష్ట్ర మహొళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జర్నలిస్టులనుద్దేశించి ప్రసంగించారు. మహిళా జర్నలిస్టుల సంక్షేమం కోసం  మంత్రిత్వ శాఖ తరపున 5 లక్షల రూపాయలను ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ జర్నలిస్టులుగా రాణిస్తున్నవారికి, ఉన్నత స్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న వారిందరికీ మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

మహిళా మీడియా సెంటర్‌ ఏర్పాటుకు  కృషి
ఈ సందర్బంగా  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంతమంది మహిళా జర్నలిస్టులను చూడటం సంతోషంగా ఉందన్నారు.  అన్ని రంగాల్లోనూ మహిళలు ఉన్నత స్థాయికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని ముఖ్యంగా మీడియా, పోలీసు రంగంలో మరింత శ్రమించాల్సి ఉంటుందన్నారు. త‌న‌ దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.

మీడియా సెంటర్ ఏర్పాటు కోసం  కూడా కృషి  చేస్తామని  మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, ఇపుడు పునర్నిర్మాణంలో కూడా జర్నలిస్టుల పాత్ర అమోఘమ‌ని ఆమె కొనియాడారు. ముఖ్యంగా మీడియాలో పురుషులతో సమానంగా ఎదగడం అంటే.. ఎంతో ఒత్తిడి ఉంటుంది, అయినా నిబద్ధతతో రాణిస్తున్నవారిని తాను చాలామందిని చూశానని, ఇది నిజంగా అభినందనీయమని సబితారెడ్డి  ప్రశంసించారు.

తెలంగాణ తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వం తరపున చేయాల్సిందంతా చేస్తామని హామీ ఇచ్చారు . జర్నలిజం అంటే  ఒక వినూత్నమైన రంగం. మీడియా రంగాన్ని కేవలం పురుషులకే పరిమితం కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా తాము  ముందుండాలనే లక్ష్యంతో సాగుతున్న  మహిళా పాత్రికేయులందరికీ హ్యాట్సాఫ్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top