Telangana: Startup Companies Allows Its Employees To Sleep At Work - Sakshi
Sakshi News home page

పని మధ్యలో ఆఫీసులో కునుకేస్తే! దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

Published Wed, Jan 25 2023 12:28 AM

Telangana: Startup Companies Allows Its Employees To Sleep At Work - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పొద్దున లేస్తే హడావుడి. ఇంట్లో పనులు చక్కబెట్టుకుని ఆఫీసుకు పరుగులు పెట్టాలి. ఉదయం 9–10 గంటల నుంచి సాయంత్రం 5–6 గంటల వరకు పనేపని. ఆఫీసు నుంచి బయల్దేరగానే సరుకులు తీసుకెళ్లడమో, మరేదైనా చోటికి వెళ్లడమో ఆలోచనలు. మొత్తంగా అన్నీ కలిసి ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. ఆఫీసులో ఉదయం ఉత్సాహంగానే ఉన్నా.. మధ్యాహ్నం కల్లా నీరసం వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే కాసేపు కునుకు తీసి, రీఫ్రెష్‌ అయ్యేందుకు కంపెనీలు వీలు కల్పిస్తున్నాయి.  

‘షార్ట్‌ స్లీప్‌ ఇన్‌ ఆఫీస్‌’ 
కరోనా మహమ్మారి తర్వాతి పరిస్థితుల్లో ఆఫీసు పని విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. వర్క్‌ ఫ్రం హోంతో మొదలై హైబ్రిడ్‌ మోడల్‌ వరకు చేరాయి. ఇటీవలికాలంలో షార్ట్‌ స్లీప్‌ ఇన్‌ ఆఫీస్‌ (స్వల్ప నిద్ర) విధానం మొదలైంది. ఆఫీసు పని సమయంలో మధ్యలో స్వల్ప విశ్రాంతి తీసుకునే వెసులుబాటును పలు సంస్థలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం కార్యాలయంలోనే నిద్ర పోయేందుకు వీలుగా ఏర్పాట్లను చేస్తున్నాయి. ఇలా విశ్రాంతి ఇవ్వటంతో ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని, ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. 

స్టార్టప్‌ కంపెనీల్లో ఎక్కువగా.. 
సాధారణ ఆఫీసులలో లాగా స్టార్టప్‌ కంపెనీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అంటూ పనివేళలు ఉండవు. ఉదయం, సాయంత్రం మరింత ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలలో ఉద్యోగులకు పనిమధ్యలో కాసేపు విశ్రాంతి ఇస్తే.. అన్ని వేళల్లో ఒకేరకమైన ఏకాగ్రతతో పనిచేయగలుగుతారని నిపుణులు చెప్తున్నారు. ఫర్నిచర్‌ కంపెనీ వేక్‌ఫిట్‌ తాజాగా ‘రైట్‌ టు న్యాప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రతి ఉద్యోగి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు కునుకు తీయవచ్చు. 

నిద్ర ఒక్కటే కాదు.. 
ఆఫీసులో నిద్ర గదులేకాదు.. బ్రేక్‌ అవుట్‌ జోన్‌లు, మీటింగ్‌లు లేనిరోజు వంటి వినూత్న పని విధానాలను కూడా సంస్థలు అందుబాటులోకి తెస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా మధ్యలో కాసేపు వాకింగ్, ధ్యానం చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. టేబుల్‌ టెన్నిస్, క్యారమ్స్‌ వంటి ఇండోర్‌ గేమ్స్‌లను కూడా అందిస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉద్యోగులకు మీటింగ్‌లు లేని వారం, రోజు అని ముందుగానే సమాచారం ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులు జాబ్‌ తర్వాత వ్యక్తిగత పనుల షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకునే వీలు ఉంటుంది. 

ఏ కంపెనీలలో ఉందంటే.. 
లీసియస్, సింప్లీ లెర్న్, సాల్వ్, నో బ్రోకర్, వేక్‌­ఫిట్, రేజర్‌పే వంటి యువ యాజమాన్య కంపె­నీ­లు, స్టార్టప్స్‌ తమ ఉద్యోగులు ఆఫీసు­లో స్వల్ప సమయం పాటు కునుకుతీసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. 

నిపుణులు చెప్తున్న లాభాలివీ.. 
►పని మధ్యలో విశ్రాంతి వల్ల ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. 
►పనిలో ఉత్పాదకత మరింతగా పెరుగుతుంది. 
►దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.  
►మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయగలుగుతారు. 
►చీటికి మాటికీ అనారోగ్య సమస్యలతో గైర్హాజరు కావటం తగ్గుతుంది. 
►ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటుండటంతో ఉ­ద్యో­గులకు యాజమాన్యంపై గౌరవం పెరుగుతుంది. 

వీ హబ్‌లో మదర్స్‌ రూమ్‌ 
పని మధ్యలో కొంత సమయం విశ్రాంతి అనేది మహిళా ఉద్యోగులకు అత్యవసరం. అందుకే వీ–హబ్‌లో మదర్స్‌ రూమ్, రిలాక్స్‌ రూమ్‌ వంటి ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు 24/7 భద్రత, అవసరమైన వసతులను కల్పించినప్పుడే వారు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. 
– దీప్తి రావుల, సీఈఓ, వీ–హబ్‌ 

కాసేపు నిద్ర మా పాలసీలో భాగం 
మా కంపెనీలో ఉద్యోగుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మధ్యాహ్నం అరగంట సేపు ఉద్యోగులకు నిద్ర సమయం అనేది పాలసీలో భాగం చేశాం. కాసేపు విశ్రాంతితో ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిమీద ఏకాగ్రత చూపుతున్నారు. 
– ఉమానాథ్‌ నాయక్, హెచ్‌ఆర్‌ హెడ్, వేక్‌ఫిట్‌  

Advertisement
Advertisement