
తెలంగాణ దళితబంధు పథకాన్ని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ సమాయత్తమవుతోంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితబంధు పథకాన్ని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని నూరుశాతం అమలు చేశారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో దళితబంధు అమలు నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది.
ముందు ఎంపిక... ఆ తర్వాత అవగాహన...: దళితబంధు పథకం అమలు చేసే గ్రామాల్లో ముందుగా సమగ్ర కుటుంబ సర్వే(ఎస్‌కేఎస్) లెక్కల ఆధారంగా దళిత కుటుంబాల గణన చేపడతారు. అనంతరం జాబితాను రూపొందించి లబ్ధిదారులను ఖరారు చేస్తారు. లబ్ధిదారుల ఎంపికలో భాగంగా కుటుంబంలో మహిళకు ప్రాధాన్యత ఇస్తారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై వారికి అవగాహన కల్పిస్తారు.
అవసరమైతే స్వల్పకాలిక శిక్షణ తరగతులు సైతం నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నగదుతో ఎలాంటి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చనేదానిపై లబ్ధిదారులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో ఈ పథకం అమలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సైతం అధికారులు తయారుచేశారు. ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై లబ్ధిదారులు అంచనాకు వచ్చిన తర్వాత నగదును విడుదల చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.