
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
సర్కార్‌లోని ఒక్కోశాఖ ఒక్కోలా వ్యవహరిస్తే ఎలా?
దశాబ్దాలుగా భూ సమస్యలు తేలకుండా కోర్టు సమయం వృథా
అధికారులపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు వస్తున్నాయని.. వందల పిటిషన్లు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటానికి వారే కారణమని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోని ఒక్కో శాఖ ఒక్కోలా వ్యవహరిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, నాలాకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ అనుమతించి.. అవసరమైతే భూ సేకరణ చేసుకోమని సర్కార్‌కు ఆదేశాలు జారీ చేస్తేనే సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ‘రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాసుపుస్తకాలిస్తూ ఉంటారు.. ము న్సిపల్ అధికారులు నిర్మాణాలకు అనుమతిస్తారు.. నీటిపారుదల అధికారులేమో నీటి ప్రవాహ మార్గమని, ఎఫ్‌టీఎల్ అని, బఫర్‌జోన్ అని చెబుతుంటారు. దశాబ్దాలు గడుస్తున్నా వివాదాలు మాత్రం పరిష్కా రం కావడం లేదు’అని వ్యా ఖ్యానించింది.
చెరువు నీరు ప్రవహించే మార్గమైతే పాస్ పుస్తకాలు ఎలా జారీ చేశారని అడిగింది. జవహర్‌నగర్ కాంపౌండ్ వాల్ తొలగింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. జవహర్‌నగర్ కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి డ్రైనేజీ, మురుగునీటిని తన భూమిలోకి అనుమతిస్తూ నీరుపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్ణ యం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కాచిగూడకు చెందిన పల్లె నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. మునక నుంచి బయటపడేందుకు ప్రహరీ కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. సమస్యను తెలియజేస్తూ అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించాలని పిటిషనర్‌కు సూచించారు. కౌంటర్ దాఖలు చేయా లని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.
పార్కింగ్ వసతి ఉంటేనే ఫ్లాట్ కొనండి
బిల్డర్లు 10 ఫ్లాట్లకు అనుమతి తీసుకుంటారు.. వీరికి పార్కింగ్ స్థలం ఉంటుంది.. అనధికారికంగా మరో 4 ప్లాట్లు నిర్మిస్తారు.. మరి వారికి పార్కింగ్ ఎలా ఇస్తారు? ప్రజలు ముందుగా పార్కింగ్ సదుపాయం చూసుకున్న తర్వాతే ఫ్లాట్లు కొనుగోలు చేయాలని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో చాలా భవనాలకు పార్కింగ్ వసతి లేకపోవడం అతి పెద్ద సమస్యగా మారిందన్నారు.హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ పార్కింగ్ సమస్యపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణ సెపె్టంబర్ 2కు వాయిదా వేశారు.