విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి | Telangana High Court Allows Tech Colleges to Collect Fee from Students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి

Apr 4 2026 5:22 AM | Updated on Apr 4 2026 5:22 AM

Telangana High Court Allows Tech Colleges to Collect Fee from Students

ఫీజుపై ఇంజనీరింగ్‌ కాలేజీలకు తేల్చిచెప్పిన హైకోర్టు

ప్రభుత్వం ఇచ్చినప్పుడు వెనక్కు ఇచ్చేయండి 

2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇది వర్తింపు 

బకాయిల చెల్లింపుపై కౌంటర్‌ దాఖలు చేయాలని సర్కార్‌కు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించిన తర్వాత సదరు విద్యార్థులకు వెనుక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న మీదట అనేక ఏళ్లుగా కాలేజీలకు సర్కార్‌ నుంచి రూ.వేల కోట్లు బకాయి ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసినా విడుదలలో విపరీత జాప్యం కారణంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది.

ఆయా కాలేజీల నిర్వహణ, కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఇతర చర్యలు ఈ పిటిషన్లలో ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇప్పటివరకు పేరుకుపోయిన రూ.వేల కోట్ల బకాయిలపై కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీతోపాటు మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేశవ్‌ మెమోరియల్‌ సహా పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది.  

జీతాలు ఇచ్చే పరిస్థితీ లేదు.. 
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎల్‌.రవిచందర్, అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా 2008, 2009లో రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందన్నారు. ఈ నిషేధం తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. ఇంజనీరింగ్‌ కళాశాలలకు సుమారు రూ.1,500 కోట్ల ట్యూషన్‌ ఫీజు బకాయిలను విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఒక ప్రైవేట్‌ వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తాలు రావాల్సి ఉంటే కోర్టులు అతన్ని డిఫాల్టర్‌గా పేర్కొని, శిక్షించేవన్నారు.

చెల్లింపులపై టోకెన్లు జారీ చేసి ఐదేళ్లయినా విడుదల చేయడం లేదన్నారు. ఒక్క కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకే రూ.56 కోట్లు బకాయి ఉందని తెలిపారు. 2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు బడ్జెట్‌ ఆమోదం ఉందని, అనుమతి పొందిన తర్వాత చెల్లించకపోవడం సబబుకాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలేజీలు ఆర్థికంగా కుదేలయ్యాయని, బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరాయన్నారు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకూ ఆదాయాన్ని సమకూర్చుకోలేక పోతున్నాయని, బకాయిలు వెంటనే చెల్లించేలా ఆదేశించాలని కోరారు. బకాయిలు మరింతగా పేరుకుపోకుండా ఉండేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

నిర్వహణ కష్టంగా మారడంతో...
పిటిషనర్లు సమరి్పంచిన గణాంకాలు సరైనవి కావని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నందున టోకెన్లు జారీ చేసిన మొత్తాల చెల్లింపునకు సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూ ర్తి.. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement