ధాన్యం నానిపోయి.. రైతన్న కుంగిపోయి.. కష్టం నీటిపాలు

Telangana: Grain Damage Due To Heavy Rains - Sakshi

అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసి, కొట్టుకుపోయిన ధాన్యం 

ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల్లో తీవ్ర నష్టం 

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌:  ఎండనకా వాననకా పండించిన రెక్కల కష్టం కళ్లముందే కొట్టుకుపోయింది. ఆ ధాన్యాన్ని ఏరుతూ, ఎత్తుతూ అన్నదాతల కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో విరుచుకుపడ్డ వాన పలు జిల్లాల్లో రైతులను నిలువునా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోళ్లలో జాప్యంతో తాము నిండా మునిగామని రైతులు వాపోయారు.

తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళనలు.. 
►నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లూర్, ఇందల్‌వాయి, నందిపేట, ఆర్మూర్, కమ్మర్‌పల్లి, నిజామాబాద్‌ రూరల్, నవీపేట, రెంజల్, ఎడపల్లి మండలాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పలుచోట్ల కేంద్రాల్లో నిలిచిన నీటిని మోటార్లు పెట్టి తోడేయాల్సి వచ్చింది. కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్, ఉప్పుటూరు గ్రామాల్లో సజ్జ పంట నేలకొరిగింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆర్మూర్‌లో రైతులు 63వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నందిపేటలో ధర్నా చేశారు.

►కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, గాంధారి, సదాశివనగర్, నిజాంసాగర్, ఎల్లారెడ్డి, రాజంపేట, బాన్సువాడ, మాచారెడ్డి, సదాశివనగర్‌ తదితర మండలాల్లో వర్షంతో భారీగా ధాన్యం తడిసి, కొట్టుకుపోయింది. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ.. తిమ్మానగర్‌ రహదారిపై రైతులు ధర్నా చేశారు. సదాశివనగర్‌ ధర్మారావ్‌పేట్, అడ్లూర్‌ ఎల్లారెడ్డి,, మర్కల్, పద్మాజివాడి తదితర గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 

►నిర్మల్‌ జిల్లాలో భారీవానకు ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, లోకేశ్వరం, లక్ష్మణచంద తదితర మండలాల్లో వరికి నష్టం వాటిల్లింది. కడెం, లోకేశ్వరం మండలాల్లో ధాన్యం తడిసి, కొట్టుకుపోయింది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్‌ మండలాల్లో 850 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. 

►మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్, దేవునిగూడ, పొనకల్, తపాలపూర్, తిమ్మాపూర్‌ గ్రామాల్లో ధాన్యం తడిసింది. 

►మెదక్‌ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. కాంటా వేసిన బస్తా లు సైతం తడిసిపోయాయి. చిన్నశంకరంపేట రైతులు మెదక్‌ – చేగుంట ప్రధాన రహదారిపై తడిసిన ధాన్యం బస్తాలతో రాస్తారోకో చేశారు. 

►రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ చందుర్తి, సిరిసిల్ల, ముస్తాబాద్‌లో రైతులు రాస్తారోకోలు చేశారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. 

►జగిత్యాల జిల్లా మల్యాల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, రాయికల్, జగిత్యాల రూరల్, అర్బన్‌ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల కోతకు వచ్చిన వరి నేలవాలింది. 

►కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లో పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీపీసీసీ తరపున ముందే విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పౌరసరఫరా ల శాఖ మంత్రి ఇటీవల మాట్లాడుతూ తూకం వేశాక ఒక్క గ్రాము తరుగు తీసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారని, కానీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై తరుగు తీసుకుంటున్నారని అన్వేష్‌రెడ్డి తెలిపారు. 

వానలు మొదలైతే ఎలా? 
నైరుతి రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో వాన లు పడుతున్నట్టు వాతావరణశాఖ సోమవారం ప్రకటించింది. మరికొద్దిరోజుల్లోనే వర్షాలు ఊపందుకోవచ్చని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రవ్యా ప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి ఉంది. దీనితో రైతుల్లో తీవ్ర ఆందో ళన వ్యక్తమవుతోంది. ధాన్యంపై కప్పడానికి టా ర్పాలిన్లు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం చె ప్తుంటే.. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా ఇవ్వడం లే దని రైతులు వాపోతున్నారు. బస్తాలు, ప్లాస్టిక్‌ సం చులతో కుట్టిన కవర్లతోనే ధాన్యాన్ని కప్పుతున్నా రు. అవి వానకు నిలవడం లేదు. ఈదురుగాలుల కు కొట్టుకుపోతున్నాయి. పైగా కింద నుంచి వరద పోటెత్తుతుండటంతో ధాన్యం తడిసిపోతోంది. 

నత్తనడకన కొనుగోళ్లు! 
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు మొదలై నెల దాటింది. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 16 లక్షల టన్నులు మాత్రమే. గత సంవత్సరం యాసంగిలో ఇదే సమయానికి ఏకంగా 36 లక్షల టన్నులకుపైగా కొనుగోలు చేయడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 6,834 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 6,117 కేంద్రాలను తెరిచారు.

అందులోనూ 4,695 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. వరంగల్, భూపాలపల్లి, ములుగు, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, భద్రాచలం, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో తక్కువ సంఖ్యలో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వరి కోతలు ఊపందుకోనందునే కేంద్రాలను ప్రారంభించలేదని అధికారులు చెప్తుండగా.. కోతలు పూర్తయినా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top