
రీయింబర్స్‌మెంట్‌కు 75% హాజరు తప్పనిసరి చేసే యోచన
పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరుతో లింకు
ప్రధాన సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి
అలాగే కనీసం సగం సబ్జెక్టులు పాస్ కావాలనే నిబంధన పెట్టే యోచన
ఎక్కడ తేడా వచ్చినా ఫీజు రీయింబర్స్‌మెంట్ రానట్టే
అధ్యాపకులకూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు!
రేపు వైస్ చాన్స్‌లర్లతో మండలి చైర్మన్ సమావేశంలో చర్చ
పథకానికి కత్తెర వేసేందుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసే ప్రసక్తే లేదని చెబుతున్న ప్రభుత్వం.. చడీచప్పుడు లేకుండా ఆ పథకంలో కోతలు వేసే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గత నెల 21వ తేదీన ‘సాక్షి’కథనం ప్రచురించగా, ప్రభుత్వం స్పందించి ‘అబ్బే అలాంటిదేమీ లేదు.. నిరాధార వార్త’అంటూ కొట్టిపారేసింది. కానీ వచ్చే శుక్రవారం అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్ గుర్తింపు హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎలా లింక్ చేయాలి, ఎలా తప్పనిసరి చేయాలి? అనే అంశాన్ని భేటీ ఎజెండాలో ప్రధానంగా చేర్చారు.
కొత్తగా కాలేజీలకు డిజీ లాకర్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో ఫ్యాకల్టీ, విద్యార్థుల హాజరు శాతం నమోదు అవుతుంది. విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సూచనలు చేసినట్టు తెలిసింది. దీనికి అనుగుణంగానే వీసీల సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోతపై వ్యూహ రచన చేయబోతున్నట్టు సమాచారం.
ముందు హాజరు.. తర్వాత మార్కులు
ప్రస్తుతానికి ముఖ గుర్తింపు హాజరు విధానం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఫిల్టర్ చేయాలని భావిస్తున్నారు. ఈ దశలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రాకపోతే తర్వాత దశలకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ మొదలుకొని అన్ని సాంకేతిక, సాధారణ కోర్సుల్లో ఒక సంవత్సరంలో 50 శాతం సబ్జెక్టులు పాసవ్వడంతో పాటు, 75 శాతం హాజరు ఉండాలన్న కొత్త నిబంధన తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి సూచనగా చెబుతున్నారు.
సాంకేతిక విద్యలో కోర్సులోని ప్రధాన సబ్జెక్టులో విద్యార్థి కనీసం 60 శాతం మార్కులు తెచ్చుకుంటేనే రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలిసింది. ఉదాహరణకు సీఎస్‌ఈ ఎమర్జింగ్ కోర్సు తీసుకున్న విద్యార్థి డేటాసైన్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులు తెచ్చుకుని తీరాలి. అదే విధంగా బీకాంలో కామర్స్ సబ్జెక్టులో మంచి మార్కులు రావాల్సి ఉంటుంది.
అధికారుల అంతర్మథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా అనేక మంది పేదలు ఉన్నత చదువులకు వెళ్లారు. తర్వాత ప్రభుత్వాలు ఈ పథకంలో మార్పులు తెచ్చేందుకు సాహసించలేదు. ఈ నేపథ్యంలో పథకంలో కోతకు అడుగులు వేయాల్సి రావడంపై అధికారులు మథనపడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రస్తుతం దాదాపు రూ.8 వేల కోట్ల వరకు పేరుకు పోయాయి. వీటిని రాబట్టుకునేందుకు కాలేజీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.
భారీగానే కోత
రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్లు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా రూ.2,350 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుంది. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్‌లో మొత్తం ఫీజు చెల్లిస్తారు. ఆపై ర్యాంకులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తారు.
మొదటి ఏడాదిలో 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులు అవ్వని విద్యార్థులు దాదాపు 50 శాతం మంది ఉంటున్నారు. ఉన్నత విద్యలో కొత్తగా ప్రవేశించడం, భయం వల్ల వారికి తక్కువ మార్కులు వస్తున్నాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, కాలేజీకి వచ్చినా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు ఆన్‌లైన్ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో హాజరును కొలమానంగా తీసుకుంటే చాలామంది విద్యార్థులకు అసౌకర్యం తప్పదని అధికారులే చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోత వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు.