చార్జీలు ఏ విధంగా పెంచాలనే దానిపై డిస్కమ్‌ల తర్జనభర్జన
ప్రస్తుతం రూ.20 వేల కోట్లకు పైగానే ఆర్థిక లోటులో పంపిణీ సంస్థలు
గృహ వినియోగదారులే లక్ష్యంగా కొనసాగుతున్న కసరత్తు
రూ.8 వేల కోట్ల మేరకు భారం పడే చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తప్పేట్టు లేదు. చార్జీలు ఏ విధంగా పెంచాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చార్జీలను నేరుగా పెంచితే ఇబ్బంది కల్గిస్తుందని ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కమ్‌లకు) సూచి ంచింది. దీంతో పరోక్ష వడ్డింపుపై డిస్కమ్‌లు దృష్టి పెట్టాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆర్థిక ఆదాయ, అవసర నివేదిక (ఏఆర్‌ఆర్)ను ఈ నెలాఖరులోగా విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)కి డిస్కమ్‌లు అందజేయాల్సి ఉంది.
ఈ గడువులోగానే ఏఆర్‌ఆర్‌లను ఈఆర్‌సీ ముందుకు తెస్తామని సంస్థలు అంటున్నాయి. రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లకు కలిపి ఇప్పటివరకూ దాదాపు రూ.20 వేల కోట్ల వరకూ ఆర్థిక లోటు ఉండవచ్చని తేలింది. వ్యవసాయ ఉచిత విద్యుత్ సహా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం డిస్కమ్‌లకు గత ఏడాది రూ.12 వేల కోట్ల వరకూ సబ్సిడీ రూపంలో ఇచ్చింది. ఈ ఏడాది కూడా ఇంతే మొత్తం ఇస్తే మిగిలిన రూ.8 వేల కోట్లకు ప్రజలపై భారం మోపకతప్పదని ,ఆర్థిక లోటును పూడ్చుకునే క్రమంలో గృహ వినియోగదారులనే డిస్కమ్‌లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు లె లిసింది.
అవసరాలూ ఎక్కువే..
రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ వినియోగం గరిష్టంగా 17,162 మెగావాట్లుగా నమోదైంది. 2026 వేసవి కాలంలో ఇది 19 వేల మెగావాట్లు మించవచ్చని అంచనా. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచాలి. దక్షిణ ప్రాంత డిస్కమ్‌ల పరిధిలో 72, ఉత్తర ప్రాంత డిస్కమ్ పరిధిలో 31 అదనపు సబ్ స్టేషన్లను నిర్మించాలి. ఎస్సీడీసీఎల్ పరిధిలో ఇంకా 8,384, ఎన్సీడీసీఎల్ పరిధిలో 5,280 అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు అవసరం. మరో వైపు కొత్త లైన్లనూ డిస్కమ్‌లు ప్రతిపాదిస్తున్నాయి.
ప్రస్తు తం రాష్ట్రంలో ఏటా 65 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంది. వేసవిలో విద్యుత్ కొనుగోలుకూ భారీగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 2024 లెక్కల ప్రకారం విద్యుత్ చార్జీల రూపంలో ఏటా రూ.45,698 కోట్ల ఆదాయం వస్తుంటే, వ్యయం రూ. 65,849 కోట్లుగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి వ్యయం మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. వినియోగదారుడికి చేరే విద్యుత్ వ్యయం పెరగడంతో సబ్సిడీని పెంచాలని డిస్కమ్‌లు కోరుతున్నాయి. బీపీఎల్ కుటుంబాలకు ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వ సబ్సిడీ రూ.2,400 కోట్లుగా లెక్కగట్టారు. వచ్చే ఏడాది ఇది రూ.3 వేల కోట్లు దాటవచ్చని చెబుతున్నారు.
ఏడాది సగటు లెక్కింపుతో వాత
ప్రభుత్వం సబ్సిడీ పెంచకపోతే కనీసం రూ.8 వేల కోట్ల వరకు విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై భారం పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రభుత్వ సూచన నేపథ్యంలో పరోక్ష విధానంలో చార్జీలు పెంచడంపై దృష్టి పెట్టిన అధికారులు గృహ విద్యుత్ వినియోగదారుల టెలిస్కోపింగ్ బిల్లింగ్ విధానంలో మార్పులు తేవాలని భావిస్తున్నారు. 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి ప్రస్తుతం యూనిట్‌కు రూ.1.95 చొప్పున వసూలు చేస్తున్నారు. 51–100 యూనిట్లకు రూ.3.10 చొప్పున చార్జీ వేస్తున్నారు. అయితే గృహ విద్యుత్ వినియోగాన్ని ఏడాది మొత్తం లెక్కించి నెలవారీ సగటు తీయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
దీనివల్ల ప్రస్తుతం 50 యూనిట్ల లోపు నెలవారీ వాడకం ఉన్న విద్యుత్ వినియోగదారుల వాడకం ఎక్కువగా నమోదై యూనిట్‌కు రూ. 3.10 భారం పడే అవకాశం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ టారిఫ్‌లు ఎక్కువగా ఉండటంతో గృహ విద్యుత్ వినియోగంపై దృష్టి పెడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో పాటు గృహజ్యోతి విద్యుత్‌ను కూడా వార్షిక విద్యుత్ లెక్కింపులోకి తీసుకొచ్చే యోచన చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ నెలకు 200 యూనిట్లు దాటితే బిల్లు వస్తుండగా, ఏడాది సగటును పరిగణనలోకి తీసుకోవడం ద్వారా 200 యూనిట్లు దాటితే బిల్లు వేసే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది.


