
సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే రూ.6 వేల కోట్ల అప్పు..
రాష్ట్ర ఖజానా కటకట..ఆశించిన మేర రాని ఆదాయం
పెరుగుతున్న ఖర్చులతో అప్పులు
అప్పుల మాసంగా సెప్టెంబర్.. త్వరలో మరో రూ.3 వేల కోట్లు సేకరణ?.. రూ.35 వేల కోట్లు దాటనున్న ఆరునెలల రుణ పద్దు
ఈ నెలలో అన్ని శాఖల ఉద్యోగులకు రాని వేతనాలు.. కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులు నెలాఖరులోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానా కటకటలాడుతోంది. ఆదాయం తక్కువై..ఖర్చులు ఎక్కువ కావడంతో అప్పులు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతినెలా రూ.12 వేల కోట్లకు మించి ఆదాయం రాకపోవడం, అదే సమయంలో రూ.18 వేల కోట్ల వరకు అనివార్య ఖర్చులు చేయాల్సి వస్తుండటంతో అప్పుల పద్దు ప్రతినెలా పెరిగిపోతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ముగిసిన ఐదు నెలల కాలం కంటే అదనంగా సెప్టెంబర్ నెల ప్రారంభంలోనేప్రభుత్వం ఏకంగా రూ.6 వేల కోట్ల అప్పు తీసుకుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా బహిరంగ మార్కెట్‌లో సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకుంది. కాగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలై 31 వరకు చేసిన రూ.25వేల కోట్లకు తోడు ఆగస్టు నెలలో తీసుకున్న రూ.3వేల కోట్లు, ఈ నెలలో తీసుకున్న రూ.6వేల కోట్లు, ఈనెలలోనే ఇంకా ప్రభుత్వం తీసుకుంటుందని భావిస్తున్న మరో రూ.3వేల కోట్లు కలిపి తొలి ఆరు నెలల్లోనే రాష్ట్ర రుణపద్దు రూ.37వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఇది మొత్తం ఏడాది కాలంలో అప్పుల రూపంలో బహిరంగ మార్కెట్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న దాదాపు రూ.64వేల కోట్లలో 50 శాతం కంటే రూ.5వేల కోట్లు ఎక్కువే కావడం గమనార్హం.
కనాకష్టంగా సర్దుబాటు
వాస్తవానికి, ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభం నుంచే నిధుల సర్దుబాటు కష్టంగా మారింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో సొంత పన్నుల ఆదాయం పెద్దగా పెరగలేదు. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లతోపాటు ఎక్సైజ్, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్... ఇలా అన్ని రాబడి మార్గాలు కలిపినా గత ఏడాది కంటే పెద్దగా మార్పు రాలేదు.
ఈ ఏడాది జూలై 31 వరకు కాగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మొత్తం బడ్జెట్ అంచనాల్లో గత ఆర్థిక సంవత్సరం జూలై నాటికి 26.01 శాతం రాగా, ఈసారి వచ్చింది 26.32 శాతం మాత్రమే. అయితే, ఖర్చుల్లో మాత్రం అనివార్య చెల్లింపులకు తోడు అనూహ్య సర్దుబాట్లు అవసరమయ్యాయి. సాధారణంగా ఇచ్చే వేతనాలు, పింఛన్లు, రెవెన్యూ వ్యయం, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు చెల్లింపులతోపాటు అంతకుముందు నెలలో రూ.9వేల కోట్ల మేరకు రైతు భరోసా, గత నెలలో రూ.700 కోట్లకు పైగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది.
కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు సమకూర్చుకొని రైతుభరోసా చెల్లించిన తర్వాత ఖజనా పరిస్థితి మరింత కష్టంగా మారిందని ఆర్థికశాఖ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నిధుల సర్దుబాటుకు వేస్‌అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌లకు వెళుతున్నామని, ఇది సాధారణమే అయినా అనూహ్యంగా ఖర్చులు వస్తే మాత్రం అప్పులు చేయక తప్పడం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం.
కాగా, ఈ నెల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇంకా కొన్ని శాఖలకు నిధులు విడుదల చేయలేదని తెలుస్తోంది. మార్కెటింగ్ తదితర శాఖల ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదని సమాచారం. కాగా, నిధుల సర్దుబాటు కాక ప్రతి నెలా కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులను నెలాఖరు వరకు వాయిదా వేస్తున్నారని, అప్పుడు వచ్చే నిధులకు అనుగుణంగా చివరి రోజుల్లో వీలున్నన్ని బిల్లులు మంజూరు చేస్తున్నారని తెలుస్తోంది.