‘అవుట్‌ సోర్సింగ్‌’కు వెయిటేజీ?

Telangana: Government Plans To Apply For 50,000 Jobs - Sakshi

ప్రత్యేక వయోపరిమితి సడలింపులు కూడా...

50 వేల ఉద్యోగ నియామకాల్లో వర్తింపజేయాలని ప్రభుత్వ యోచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీ ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయం తెరపైకి వచ్చింది. కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీతోపాటు ప్రత్యేక వయోపరిమితి సడలింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం చాలా శాఖల్లో మంజూరైన పోస్టులు ఖాళీగా ఉన్నా ఆయా పోస్టుల స్థానంలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష నియామకాలతో ఈ ఖాళీలను భర్తీ చేస్తే ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రోడ్డునపడే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది.

దీంతో అలాంటి వారిని రోడ్డున పడేయకుండా సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వ కొలువుల భర్తీపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. పోలీసు కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు 10 శాతం కోటా అమలు చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి సైతం ప్రత్యేక వెయిటేజీతో ప్రయోజనం కల్పించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వారి సంఖ్య చాలా తక్కువే... 
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 66,239 మంది కాంట్రాక్టు, 58,128 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో కొందరు మంజూరైన పోస్టుల్లో పనిచేస్తుండగా (అగైనెస్ట్‌ శాంక్షన్డ్‌ పోస్ట్స్‌), మరికొందరు మం జూరైన పోస్టులతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. మంజూరైన పోస్టులకు బదులుగా పనిచేసే కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మంజూరైన పోస్టులు సైతం ఉన్నత కేడర్లకు సంబంధించినవి ఉండగా వాటి స్థానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్‌ సబార్డినేట్ల వంటి కిందిస్థాయి ఉద్యోగులను కాం ట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులను భర్తీ చేసినా కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి నామమాత్ర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో సీఎం సానుకూల దృక్పథంతో ఉన్న నేపథ్యంలో వారి ఉద్యోగాలకు వచ్చిన నష్టం లే దని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కు తెలిపారు.

ఇక ఆధార్‌ తప్పనిసరి.. 
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కొందరు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఒకే పేరుతో వేర్వేరు జిల్లాల్లో నాలుగైదు చోట్ల జీతాలు పొందుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. దీంతో అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమాలకు తెరదించేందుకు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల చెల్లింపులను వారి ఆధార్‌ కార్డులతో అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top