సచివాలయ కూల్చివేత.. మీడియా కవరేజ్‌కు అనుమతి

Telangana Government Allows Media To Secretariat Demolition Works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయ భవనాల కూల్చివేత పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స‌చివాల‌య భ‌వ‌నాల‌ కూల్చివేత ప‌నుల వ‌ద్ద‌కు వెళ్లేందుకు మీడియాకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. ఈ క్ర‌మంలో సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు బీఆర్కే భ‌వ‌న్ నుంచి సిటీ పోలీసు క‌మిష‌న‌ర్ నేతృత్వంలో మీడియా ప్ర‌తినిధులు.. స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత ప‌నుల వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు. ఈనెల 6 వ తేది అర్ధరాత్రి నుంచి కూల్చివేతలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మధ్యలో హై కోర్టు కూల్చివేతల పనులను వారం రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రతిపక్ష పార్టీలు కూల్చివేతలను ఆపాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. దాంతో ప్రభుత్వం కూల్చివేత పనులను తిరిగి ప్రారంభించింది. (సినిమా అయిపోయాక టికెటిస్తే?)

ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేయడం జరిగింది. మిగతా పనులు జరుగుతున్నాయి. ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు. అయితే కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింనట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ప్రకటించారు. (కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు షాక్‌..)

అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు బీర్కే భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి, సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top