జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్‌

Telangana Forms Special Revenue Tribunals - Sakshi

కలెక్టర్‌ నేతృత్వంలో అదనపు కలెక్టర్‌ సభ్యుడిగా ఏర్పాటు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

16,137 కేసుల భవితవ్యం తేల్చనున్న ట్రిబ్యునళ్లు

సాక్షి, హైదరాబాద్‌: భూవివాదాల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూవివాదాలపై విచారణ జరిపి పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సభ్యుడిగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. జిల్లా స్థాయిలో మూడంచెల్లో తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్‌ కలెక్టర్ల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 16 వేల కేసులు పరిష్కారమయ్యే వరకు ఈ ట్రిబ్యునళ్లు పనిచేయనున్నాయి. ఆ తర్వాత అవసరాల మేరకు వీటి కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత సెప్టెంబర్‌ 7న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–2020 తీసుకొచ్చింది. ఇనామ్‌తో పాటు రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌ చట్టం–1971 రద్దయిన నేపథ్యంలో వివిధ స్థాయిల్లోని రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ప్రభుత్వం అప్పట్లో సీసీఎల్‌ఏ (భూపరిపాలన ప్రధాన కమిషనర్‌)కు బదిలీ చేసింది. తాజాగా ఈ కేసులను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లకు అప్పగించింది. బదిలీ చేసిన నెల రోజుల్లోగా అన్ని కేసులను పరిష్కరించాలని ట్రిబ్యునళ్లకు గడువు విధించింది. అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) పోస్టు ఖాళీగా ఉంటే, ఆయన స్థానంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ట్రిబ్యునల్‌ సభ్యుడిగా.. ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న సమయంలో డీఆర్‌వో సభ్యుడి గా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది.  
చివరకు కలెక్టర్లకే బాధ్యతలు
రిటైర్డ్‌ జిల్లా జడ్జీలు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో తాత్కాలిక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైరైన ఐఏఎస్‌లతో ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకున్న అవకాశాలను సైతం ప్రభుత్వం పరిశీలించింది. ఇలా కొంతమంది అధికారుల జాబితాలను సైతం ప్రభుత్వం సిద్ధం చేసింది. చివరకు జిల్లా కలెక్టర్లకే ఈ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.  
ట్రిబ్యునళ్ల ప్రత్యేకతలు.. 

  • జిల్లా కేంద్రంలోనే కాకుండా అవసరమైతే రెవెన్యూ డివిజనల్, మండల కేంద్రాల్లో కేసుల పరిష్కారం కోసం ట్రిబ్యునల్‌ సమావేశం కావచ్చు.
  • ట్రిబ్యునళ్ల కోసం జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే ఉద్యోగుల సేవలనే వినియోగించుకోవాలి.
  • ప్రతి కేసుకు సంబంధించిన తీర్పులను కంప్యూటరైజ్డ్‌ చేయాలి. కేసు పురోగతిని ట్రాక్‌ చేసి పరిష్కరించేందుకు వీలుగా కేసుకు సంబంధించిన మెటా డేటాను జాగ్రత్తపర్చాలి. సిస్టం ద్వారా ప్రతి కేసుకు నంబర్‌ కేటాయించాలి.
  • తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం–2020లోని సెక్షన్‌ 13లో పేర్కొన్న అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు సంక్రమిస్తాయి.
  • రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ట్రిబ్యునల్‌కు బదలాయించాలి.
  • చట్టం మేరకు ట్రిబ్యునల్‌ ఇచ్చే తీర్పులు అమలవుతాయి. కేసుల పరిష్కారం అనంతరం వీటికి సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టరేట్‌లో నిబంధనల ప్రకారం భద్రపర్చాలి.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top