
హైదరాబాద్‌లో పెరుగుతున్న బహుళ అంతస్తుల భవనాలు
50 అంతస్తులకు మించి నిర్మాణాలు
18 అంతస్తుల వరకే మన అగ్నిమాపక శాఖ ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ
ఆపై అంతస్తుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే పరిస్థితేంటి..?
భవనాల్లోని సొంత రక్షణ వ్యవస్థే కీలకం అంటున్న అధికారులు
ఢిల్లీ, ముంబై నగరాల్లో అగ్నిమాపక శాఖ వద్ద 50 అంతస్తులకు సరిపడా ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ
రాష్ట్రంలోనూ ఆధునిక వ్యవస్థ అత్యవసరమంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విశ్వనగరంలా మారుతోంది. సిటీ నలువైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ఆకాశాన్నంటుతున్నాయా..అన్నట్టుగా బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతున్నాయి. 50 అంతస్తులకు మించి కూడా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. నగర అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తున్న ఈ ఆకాశ హర్మ్యాలు.. అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది.
మరి ఈ బహుళ అంతస్తుల భవనాలు ఎంతవరకు భద్రం? ముఖ్యంగా ఏ కారణంతోనైనా, ఊహించని విధంగా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి? ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యవస్థ వాటిల్లో ఉంటోందా? మన అగ్నిమాపక శాఖ సామర్థ్యం ఎంతవరకు ఉంది? 40–50 అంతస్తుల వరకు కూడా మంటలను ఆర్పగలిగే, వాటిల్లో ఉండే వారిని రక్షించగలిగే అధునాతన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి.
ఇప్పుడున్న అరకొర రక్షణ వ్యవస్థలు, ఆయా భవనాల్లోని సొంత భద్రతా ఏర్పాట్లు, వాటి పర్యవేక్షణ పరిగణనలోకి తీసుకుంటే హైరైజ్ నివాస, వాణిజ్య సముదాయాలన్నీ ఒకింత డేంజర్‌లో ఉన్నట్టుగానే చెప్పాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరంలా మారుతున్నా.. రాష్ట్ర అగ్నిమాపక శాఖ వద్ద కేవలం 18 అంతస్తుల వరకు మాత్రమే ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఆపై అంతస్తుల్లో ప్రమాదం జరిగితే కష్టమేనని, ఆయా భవనాల్లో ఉన్న సొంత రక్షణ వ్యవస్థపైనే అంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎంత?, భవనాల్లో ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉండాలి? పర్యవేక్షణ మాటేమిటి? యాజమానుల బాధ్యతలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
జీ ప్లస్ 5 దాటితే అనుమతి తప్పనిసరి
హైదరాబాద్‌లో జీ ప్లస్ 5 అంతస్తులకు (నివాస సముదాయాలు) పైబడిన భవనాలన్నిటికీ అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. అదే వాణిజ్య, ఇతర భవనాలు జీ ప్లస్ 4 మించితే అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నగరంలోని అన్ని హైరైజ్ భవనాలకూ అగ్నిమాపక శాఖే అనుమతులు ఇస్తోంది. భవనం డిజైన్, నిర్మాణం, తర్వాత ఆక్యుపెన్సీ తదితర అన్ని సందర్భాల్లో అన్నీ పరిశీలించాకే ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) మంజూరు చేస్తున్నారు. ఒకసారి ఎన్‌ఓసీ వచి్చన తర్వాత యజమానులు ఐదేళ్లకు ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆయా భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాతే అధికారులు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అయితే అనుమతులు మంజూరు చేస్తున్న అధికారులు, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదనే విమర్శలున్నాయి. అగ్నిమాపక శాఖలో దాదాపు 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండడం ఈ పరిస్థితికి కారణమనే వాదన ఉంది. పత్రి నెలా 11వ తేదీన జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి (ఏడీఎఫ్‌ఓ), 23న డీఎఫ్‌ఓలు భవనాలు ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు. సిబ్బంది కొరత నేపథ్యంలో భవనాల సంఖ్య మేరకు తనిఖీలు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి.
మన అగ్నిమాపక శాఖ సన్నద్ధత ఎలా ఉంది?
తెలంగాణ మొత్తం కలిపి 147 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి..జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 ఫైర్ స్టేషన్లు, 3 అవుట్ పోస్ట్‌లు ఉన్నాయి. అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా సుశిక్షితులైన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్‌లో 55 మీటర్ల ఎత్తు వరకు అంటే 18 అంతస్తుల వరకు వెళ్లగలిగే బ్రాంటో స్కై లిఫ్ట్‌లు రెండు ఉన్నాయి.
వీటికి అదనంగా 133 వాటర్ టెండర్లు (ఫైర్ ఇంజిన్లు), 5 నీటి సరఫరా లారీలు, 56 మల్టీపర్పస్ టెండర్లు, 10 అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్లు, 17 వాటర్ బౌజర్లు సహా కీలక పరికరాలు ఉన్నాయి. ఇక 18 అంతస్తులకు మించిన భవనాల్లో అంతర్గతంగా ఉండే ఫైర్ పంపులు, నీళ్ల ట్యాంకులు, ఇతర వ్యవస్థలను ఉపయోగించుకుని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేయాల్సి ఉంటుంది.
బిల్డర్లు, నిర్వాహకుల బాధ్యతలేమిటి?
– భవనం భద్రతను బిల్డింగ్ నిర్వాహకులు, యజమానులు విధిగా పర్యవేక్షించాలి.
– సాధారణ సెక్యూరిటీ మాదిరిగా ప్రైవేటు ఫైర్ ఆఫీసర్లు, ఫైర్ గార్డులను నియమించుకోవాలి.
– బిల్డర్లు ప్రతి ఆకాశ హర్మ్యంలో విధిగా ఓ రెస్క్యూ ప్లేస్ పెట్టాలి. ఆ భవనంలో అంతస్తులను బట్టి నాలుగు ఫ్లోర్లకు ఒక రెస్క్యూ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
– ప్రత్యేకంగా ఫైర్ లిఫ్ట్ ఉండాలి. అగ్నిప్రమాదాల సమయంలో ఫైర్ సిబ్బంది మాత్రమే దీన్ని వాడతారు. దీనికి పవర్ సప్లై ప్రత్యేకంగా ఉండాలి.
– నిర్వాహకులకు ఎమర్జెన్సీ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. అగ్నిప్రమాదం జరిగితే ఎవరు ఎలా స్పందించాలనే ప్రణాళిక ఉండాలి.
– భవనాల్లో నివాసం ఉండేవారికి, పనిచేసే సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలనే దానిపై తరచూ శిక్షణ ఇవ్వాలి.
– ఫైర్ అలారమ్‌లు, స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు సరిగా పనిచేస్తున్నాయా..లేదా చూసుకోవాలి.
– అయితే చాలా భవనాల్లో.. నిర్మాణం, ఆక్యుపెన్సీ సమయంలో ఉండే ఫైర్ ఫైటింగ్ పరికరాలు...కొన్నాళ్ల తర్వాత పనిచేసే స్థితిలో ఉండడం లేదన్న విమర్శలు ఉండటం గమనార్హం.
ఢిల్లీ, మహారాష్ట్రల్లో మెరుగ్గా..
ఫైర్ సేఫ్టీ అంశంలో మన దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన చట్టాల అమలు పక్కాగా ఉండడంతో పాటు అగ్ని ప్రమాదాల నియంత్రణ మెరుగ్గా ఉంది. ఢిల్లీలో 110 మీటర్ల స్కైలిఫ్ట్‌లు నాలుగు అందుబాటులో ఉన్నాయి. పైర్ ఫైటింగ్ పరికరాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిబంధనల అమలులో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో 50 అంతస్తుల వరకు చేరుకునే ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం.
విదేశాల్లో పటిష్ట వ్యవస్థలు
సింగపూర్, దుబాయ్, అమెరికా, ఆ్రస్టేలియా, జర్మనీ, జపాన్, కెనడా, లండన్ దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత పక్కాగా అగ్నిమాపక వ్యవస్థ ఉంది. ఈ దేశాల్లో ఫైర్ స్టేషన్లు అన్ని ప్రాంతాలకు సమీపంలో అందుబాటులో ఉంటాయి. ఫైర్ ఫైటింగ్‌లోనూ ఆయా దేశాల సిబ్బంది ముందుంటున్నారు. పౌరులందరికీ అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలో పూర్తి అవగాహన కలి్పస్తారు. ఏదైనా భవనం వినియోగంలోకి వచి్చన తర్వాత కూడా అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుంటుంది. తరచూ తనిఖీలు, ఫైర్ మాక్ డ్రిల్స్ పక్కాగా కొనసాగుతుంటాయి.
ఫైర్ ఫైటింగ్ ఆఫీసర్లను నియమించుకోవాలి
కార్యాలయాలు, ఆసుపత్రులు ఇలా ప్రతి బహుళ అంతస్తుల భవనాల్లోనూ అగ్నిప్రమాదాల సమయంలో వెంటనే స్పందించేలా, ఫైర్ ఫైటింగ్‌కు సంబంధించిన పరికరాల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లను పెట్టుకోవాలి. వీరందరికీ అగ్నిమాపక శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ వ్యవస్థ ప్రమాదం జరిగిన మొదటి రెండు గంటలపాటు ఫైర్ ఫైటింగ్‌కు ఉపయోగపడుతుంది. ప్రాణ నష్టం నివారించలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు పూర్తిస్థాయిలో ఆర్పే పనితో, ప్రజా రక్షణ చర్యలు చేపడతారు. రాష్ట్రంలో ఉన్న అగ్నిమాపక వాహనాలు, పరికరాలు ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.
– వై.నాగిరెడ్డి, డీజీ, అగ్నిమాపక శాఖ
తరచూ తనిఖీలు ఎంతో అవసరం
బహుళ అంతస్తుల భవనాలకు డిజైన్ చేయడంలో ఫైర్ సేఫ్టీ అంశం కూడా అత్యంత కీలకమైనది. డిజైన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం జరిగిందా లేదా? ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా? అన్నది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో అధికారులు తనిఖీ చేయాలి. ఆ తర్వాత కూడా తరచూ తనిఖీలు నిర్వహించాలి. నివాస సముదాయాల్లో కంటే హైరైజ్ కమర్షియల్ బిల్డింగ్స్‌లో అగ్ని ప్రమాదాల రిస్క్ ఎంతో ఎక్కువ. ప్రమాదం జరిగితే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాణిజ్య భవనాల విషయంలో అదనపు జాగ్రత్తలు మరింత అవసరం.
– భిక్షపతి, మాజీ డైరెక్టర్ జనరల్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్
మెయింటినెన్స్ పట్టించుకోక పోతే కష్టమే..
మన దగ్గర వేగంగా అభివృద్ధి జరగడం, ఆ మేరకు బహుళ అంతస్తులు వస్తుండటం ఎంతో సంతోషించదగ్గ విషయం. బిల్డింగ్ డిజైన్లలో, నిర్మాణంలో.. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నాం. కానీ ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫైర్‌సేఫ్టీని పట్టించుకోవడం లేదు. ఫైర్ ఫైటింగ్ పరికరాల మెయింటినెన్స్‌పై అటు ప్రభుత్వ విభాగాలు కానీ, ఇటు భవన యజమానులు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మన హైరైజ్ భవనాలు డేంజర్‌లో ఉన్నట్టే.
ఫైర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అవసరమైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి డెవలపర్స్ నుంచి ఫీజులు వసూలు చేసినా ఫర్వాలేదు కానీ అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధునీకరించాలి. ప్రతి ఆరు నెలలకు ఫైర్ ఫైటింగ్ పరకరాలు తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు, భవనాల యజమానులకు బాధ్యత అప్పగించి ప్రభుత్వ విభాగాలు తప్పుకోవడం సరికాదు.
– సీఏ ప్రసాద్, ప్రెసిడెంట్, ప్రీ ఇంజినీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా
హైరైజ్ బిల్డింగుల్లో ఉండాల్సినవేమిటి?
⇒ నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బీసీ) ప్రకారం.. ఎత్తైన భవనాల్లో స్మోక్ డిటెక్టర్లు, వాటర్ స్ప్రింక్లర్లు, ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ (తక్షణ రక్షణ వ్యవస్థ), తగిన నీటి సరఫరా సౌకర్యం, ఫైర్ పంపులు, ఫైర్ ఎస్కేప్ మార్గాలు, ఫైర్‌మెన్ లిఫ్ట్, సర్వీస్ షాఫ్ట్ ఎన్‌క్లోజర్‌లు, ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ తప్పక ఉండాలి. నివాస సముదాయాలైనా, ఇతర భవనాలైనా ఇవన్నీ తప్పనిసరి. ఇలా అన్ని దశల్లోనూ అగ్నిమాపక వ్యవస్థ సరిగా ఉందా? లేదా? అన్నది అత్యంత కీలకం.
వ్యవస్థ ఇలా పనిచేయాలి
⇒ భవనం ఎత్తు ఆధారంగా పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ పంపులు, నీటిని చల్లేలా పూర్తి వ్యవస్థ ఉండాలి. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ఎలక్ట్రిక్ పంపులు పనిచేయడం ప్రారంభం కావాలి.
⇒ ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ల వ్యవస్థ కూడా ఉండాలి. ఇదీ పని చేయకపోతే డీజిల్ పంపు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా కనీసం రెండు గంటల పాటు మంటలను నిలువరించి, నివాసితులు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా ఉండాలి.