Telangana Expressed Concerns Over Centre's Budget Allocation - Sakshi
Sakshi News home page

Telangana: మనకొచ్చేది ఎంత? 

Published Wed, Feb 1 2023 3:40 AM

Telangana expresses concerns over Centres budget allocations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉంటాయోననే దానిపై తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి, అమల్లోకి రాని నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాల సిఫారసుల విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదాతోపాటు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి రాష్ట్ర విభజన హామీల విషయంలో కేంద్రం ఈ ఏడాదైనా సానుకూలంగా స్పందిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అప్పులపై పరిమితులు, గ్రాంట్ల బకాయిలు, పన్నుల్లో వాటాల తగ్గింపు, సిఫారసులు అమలుకాని కారణంగా రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.  

వివిధ అంచనాల్లో ఆర్థికశాఖ.. 
మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఎలా ఉంటుందోనని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడమే కాకుండా అప్పులు తెచ్చుకునే పరిమితుల కారణంగా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.15వేల కోట్లకుపైగా లోటు వచి్చందని.. ప్రత్యేక గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాది దాదాపు రూ.30వేల కోట్ల వరకు నష్టపోయామని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కార్పొరేషన్లకు పూచీకత్తు ఇచ్చి తీసుకునే రుణాలను రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కింద ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా వెసులుబాటు కల్పి స్తుందా? పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు ఎంత ప్రతిపాదిస్తుంది? కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో నిర్మలా సీతారామన్‌ పెద్ద మనసు చూపుతారా? ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, ఉపాధి హామీ, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, మహిళాశిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా’అన్న కేంద్ర బడ్జెట్‌లో తేలిపోనుందని అంటున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మేరకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, ఇతర నష్టాలు 
►పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రెవెన్యూ నష్టం: రూ.33,712 కోట్లు 
►నీతి ఆయోగ్‌ మిషన్‌ భగీరథ సిఫారసులు: రూ.19,205 కోట్లు 
►నీతి ఆయోగ్‌ మిషన్‌ కాకతీయ సిఫారసులు: రూ.5 వేల కోట్లు 
►ఏపీ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్‌ బకాయిలు: రూ.17,828 కోట్లు 
►ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల కారణంగా 2022–23లో అప్పుల నష్టం: రూ.15,303 కోట్లు 
►ఆంక్షలు అమలు చేయలేదంటూ జీఎస్‌డీపీలో 5 శాతం రుణ పరిమితితో నష్టం: రూ.6,104 కోట్లు 
►15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లు: రూ.5,374 కోట్లు 
►వెనుకబడిన జిల్లాలకు నిధుల బకాయిలు: రూ.1,350 కోట్లు 
►14వ ఆర్థిక సంఘం సిఫారసుల బకాయిలు: రూ.817 కోట్లు 
►15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక నిధులు: రూ.723 కోట్లు 
►ఏపీకి పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్‌ పథకాల నిధులు: రూ.495 కోట్లు 
►2020–21లో పౌష్టికాహార పంపిణీ కోసం ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు: రూ.171 కోట్లు   

Advertisement

తప్పక చదవండి

Advertisement