కేసీఆర్‌.. మరో అంబేడ్కర్‌ 

Telangana: Dalit Bandhu Takes Off In Karimnagar - Sakshi

దళితబంధు యూనిట్ల జారీలో మంత్రులు గంగుల, కొప్పుల 

తొలిలబ్ధిదారులకు వాహనాల అందజేత

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: దళితబంధు పథకం ప్రకటించడమే కాకుండా నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు అందజేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దళితులకు మరో అంబేడ్కర్‌ అయ్యారని మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలో గురువారం దళితబంధు పథకం నిధులతో నలుగురు లబ్ధిదారుల కుటుంబాలకు మంత్రుల చేతుల మీదుగా వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ..అన్నమాట ప్రకారం దళితబంధు నిధులు రూ. 2000 కోట్లు మంజూరు చేసి దళితుల అభ్యున్నతిపై సీఎం కేసీఆర్‌ తన చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. అణగారినవర్గాల సంక్షేమం, అభివృద్ధి మాటల్లోనే కాదని, లబ్ధిదారులకు వాహనాలు అందజేసి సీఎం కేసీఆర్‌ తన చేతల్లోనూ చాటుకున్నారని కొనియాడారు. అనంతరం గంగుల  మాటాడుతూ..దళితబంధు ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాలేరును.. యజమానినయ్యాను 
నేను వ్యవసాయ పాలేరుగా ఉండేవాడిని. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక్క కొడుకు. దంపతులిద్దరం పనిచేస్తేనే పూటగడిచేది. దళితబంధులో ఇచ్చిన ఈ ట్రాక్టర్‌తో నా జీవితం బాగు చేసుకుంటా. పాలేరుగా ఉన్న నేను యజమానినైతనని జిందగీల ఎప్పుడు అనుకోలే.  
– దాసారపు స్వరూప–రాజయ్య, వీణవంక 

కేసీఆర్‌ మా దేవుడు..
మా ఆయన ఆటో డ్రైవర్‌. కేసీఆర్‌ మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపి మాకు దేవుడు అయిండు. అధికారులిచ్చిన అశోక్‌ లేలాండ్‌ ట్రాలీతో మా బతుకులు బాగుపడతయి. 


– జి.సుగుణ–మొగలి, జమ్మికుంట అంబేడ్కర్‌ నగర్‌ 

సీఎం సర్‌ సల్లగుండాలె..  
మాకు స్వరాజ్‌ ట్రాక్టర్‌ ఇచ్చిర్రు. నా కొడుకు రాజశేఖర్‌ మూడునాలుగేళ్లుగా డ్రైవర్‌గా చేస్తుం డు. గందుకే, మాకు ట్రాక్టర్‌ గావాలన్నం. ఇంకా ట్రాలర్, గడ్డి చుట్టే బేలర్‌ కూడా తీసుకుంటం. వ్యవసాయ పనులు, పొలంకోతలు, మట్టితరలింపులతో బిజీగా ఉండాలనుకుంటున్నం.  


– ఎలుకపెల్లి కొమురమ్మ, చల్లూరు, వీణవంక  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top