ఉస్మానియాకు ఆరుగురి తరలింపు
నిమ్స్‌లో నందిని, సుజాతలకు చికిత్స
మెడ్‌లైఫ్‌లో టిప్పర్ యజమానికి వైద్యం
పీఎంఆర్‌లో 12 మంది, వికారాబాద్‌లో ఒకరు
ఆస్పత్రి నుంచి ఐదుగురి డిశ్చార్జి
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/మొయినాబాద్: మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కోలుకుంటున్నారు. స్వల్ప గాయాలతో వికారాబాద్, చేవెళ్ల ఆస్పత్రుల్లో చేరిన 27 మందిలో ఇప్పటికే ఆరుగురు డిశ్చార్జ్ కాగా, మంగళవారం మరో ఐదుగురు ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తు తం ఉస్మానియా ఆస్పత్రిలో ఆరుగురు, పీఎంఆర్‌లో 12 మంది, వికారాబాద్‌లో ఒకరు, నిమ్స్‌లో ఇద్దరు, మెడ్‌లైఫ్‌లో ఒకరు చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో చేవెళ్ల పీఎంఆర్ ఆస్పత్రిలో చేరిన ఎండీ యోనస్, జె.జగదీశ్‌తోపాటు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బి.ప్రవీణ, సయ్యద్ తహ్రా, సయ్యద్ ఖాతిజలు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపారు.
మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు..
తలకు తీవ్ర గాయాలైన సయ్యద్ అస్మాను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. షేక్ తస్లీమా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ ఖాజావలి, సయ్యద్ షఫీలను కూడా ఉస్మానియాకు పంపారు. ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మోహిని స్వప్న మాత్రమే చికిత్స పొందుతోంది. పీఎంఆర్ ఆస్పత్రిలో 12 మందికి చికిత్స అందిస్తున్నారు. సుజాత, నందినికి నిమ్స్‌లో చికిత్స చేశారు. టిప్పర్ యజమాని లక్ష్మణ్‌నాయక్ బండ్లగూడ జాగీర్‌లోని మెడ్‌లైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శకలాలే ఆనవాళ్లు..
ఘోర ప్రమాదంతో భీతావహంగా మారిన మీర్జాగూడ మంగళవారం నిశ్శబ్దంగా కనిపించింది. కంకర లోడుతో వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది మరణించగా, 27 మంది గాయపడిన విషయం తెలిసిందే. సోమ వారం శవాల దిబ్బలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో కంపించిన ఈ ప్రాంతం సాధారణంగా మారిపోయింది. ఆ మార్గంలో వెళ్లేవాళ్లు ప్రమాద స్థలాన్ని ఆసక్తిగా, ఒకింత భయంగా పరిశీలిస్తూ ఘటనపై చర్చించుకున్నారు. రోడ్డు పక్కన కంకర దిబ్బలు, వాహనాల శకలాలు ప్రమాదానికి ఆనవాళ్లుగా మిగిలాయి. టిప్పర్, బస్సును చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిద్ర వస్తుంటే మధ్యలో చాయ్ తాగాం
ఏడాది క్రితమే టిప్పర్ కొనుగోలు చేశాను. అప్పటికే నాతో కలిసి పనిచేసిన మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌కాంబ్లేను డ్రైవర్‌గా నియమించుకున్నా. ఆదివారం రాత్రి లక్డారం సమీపంలోని క్వారీలో కంకర లోడ్ చేయించాం. సోమవారం తెల్లవారుజాము వరకు నేనే టిప్పర్ నడిపాను. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వల్ల నిద్ర వస్తుంటే మధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి ఇద్దరం చాయ్ తాగాం. అప్పటి వరకు నా చేతిలో ఉన్న స్టీరింగ్‌ను ఆకాశ్ కాంబ్లే తీసుకున్నాడు. గమ్యస్థానానికి మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటామనగా ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. టిప్పర్‌లోనే స్పృహ తప్పిపోయాను. పోలీసులు నన్ను బయటికి తీసి వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. నేను కానీ, ఆకాశ్ కాంబ్లే కానీ మద్యం సేవించలేదు. – లక్ష్మణ్ నాయక్, టిప్పర్ యజమాని
ప్రాణం పోవడం ఖాయమనుకున్నా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జయసుధ
లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్‌తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది.
నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు.


