తడి ఆరని కళ్లు | Telangana bus accident: Family Loses 3 Daughters In Telangana Bus Crash | Sakshi
Sakshi News home page

తడి ఆరని కళ్లు

Nov 5 2025 5:57 AM | Updated on Nov 5 2025 9:04 AM

Telangana bus accident: Family Loses 3 Daughters In Telangana Bus Crash

కూతుళ్ల జ్ఞాపకాలతోనే ‘తల్లి’డిల్లుతున్న ఆ హృదయాలు  

రెండు నెలల్లో వచ్చి హైదరాబాద్‌కు తీస్కపోతమన్నరు  

మళ్లీ రాకుండా వారే తిరిగిరాని లోకాలకు పోయిండ్రు  

ముద్దుగా తయారైండ్రని ఎవరి దిష్టి తగిలెనో... 

మొదటిసారి ముగ్గురు కలిసి ఒకే బస్సులో పోయిండ్రు 

కన్నీటిపర్యంతమైన తండ్రి ఎల్లయ్యగౌడ్‌

నేను కూలి చేసి నా సెల్లిని సదివిస్తా

అబ్బుకే సాత్‌ దో గంటేమే..

పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్లమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారైండ్రు.. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు.. మమ్ములను దిక్కులేనోళ్లను చేసి వెళ్లిపోయిండ్రు. రెండు నెలల్ల ఇద్దరం జాబ్‌ చేస్తం.. వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్‌ తీస్కపోతాం నాయినా అంటూ చెప్పి బస్సెక్కిండ్రు. ఇట్ల నన్ను పూర్తిగా ఇడిసిబెట్టి పోతరనుకోలేదు..    –ఎల్లయ్యగౌడ్‌  

వికారాబాద్‌: ‘అయ్యో పాపం ఎల్లయ్యా..నీకు నలుగురూ బిడ్డలేనా అని చాలామంది మాట్లాడినా ఎన్నడూ బాధ కాలేదు. నా నలుగురు కూతుళ్లు ‘నిన్ను నలుగురిలో దర్జాగా నిలబెడతాం...నిన్ను గెలిపిస్తాం నాయనా’అని నాకు కొండంత ధైర్యం చెప్పేవారు. ఒక బిడ్డకు పెళ్లి చేసి, అత్తగారింటికి పంపి నెలకూడా కాకుండానే మిగతా ముగ్గురు బిడ్డలను దేవుడు తీస్కపోయిండు’అంటూ అంబిక–ఎల్లయ్యగౌడ్‌ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చెట్టంత బిడ్డలను పోగొట్టుకున్న వీరి బాధ వర్ణనాతీతం.

సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వికారాబాద్‌ జిల్లా యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లికి చెందిన తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందిన విష యం తెలిసిందే. మంగళవారం ‘సాక్షి’ఎల్లయ్యగౌడ్‌ను కలిసి పరామర్శించే ప్రయత్నం చేయగా, కూతుళ్ల గురించి విలపిస్తూ చెప్పిన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... ‘సదువులో ఎప్పుడూ ముందుండేవారు. వారు బాగా సదివి నాకు ఫీజులు తగ్గించేవారు.. అందరూ రెకమండేషన్లు అంటూ నాయకుల చుట్టూ తిరిగి ఫీజులు తగ్గించుకుంటే, నా బిడ్డలు బాగా సదివి క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవారు.. మా నాయన డ్రైవింగ్‌ చేస్తాడు.. మేము బాగా సదువుతున్నాంగా.. ఫీజు తగ్గించండని సార్లను అడిగి తక్కువ చేయించేవారు.

ఇంటర్‌ సదివేటప్పుడే యోగా నేర్చుకొని, అంతా యోగా టీచర్లు అయ్యారు.. వాళ్లే వేరే వాళ్లకు నేర్పించెటోళ్లు. కూతుళ్లను సదివించటానికే ఊర్లోనుంచి తాండూరు టౌన్‌కు వచ్చేశా. ఇప్పుడు వాళ్లే లేకపోతే నాకు దిక్కెవరు.  

జిల్లేడు చెట్టుకు పెళ్లి చేస్తా అనుకోలేదు బిడ్డా..: నా బిడ్డలు బాగా సదివి నన్ను నలుగుట్లో గొప్పగా నిలబెడతమన్నారు. కానీ ఇట్ల మమ్ములనే ఒంటరోళ్లను చేసి పోతారనుకోలేదు. బాగా సదివించి కొలువులు చేస్తుంటే.. శాతనైనంతలో గొప్పగా పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి సాగనంపుతాననుకున్నా. కానీ ఇట్ల జిల్లెడు చెట్టుకు పెళ్లిళ్లు చేసి ముగ్గురిని ఒకేసారి పాడెగట్టి సాగనంపుతానను కోలేదు. మొన్న పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్లమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారైండ్రు.. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు ..మమ్ములను దిక్కులేనోళ్లను చేసి వెళ్లిపోయిండ్రు.

పదోతరగతి, ఇంటర్‌లో ఒచ్చిన మార్కులు చూసి.. సదువులో నా బిడ్డెల ఉశారు సూసి కోఠి ఉమెన్స్‌ కాలేజీలో మేడం ఫ్రీ సీటు ఇచ్చింది. నేను మంచి అంగి తొడుక్కోకపోయినా నా చిన్నబిడ్డ ఒప్పుకునేది కాదు.. మంచి అంగి తొడిగి తలదువ్వి నొసటికి బొట్టుపెట్టి భుజంపై తట్టేది. చెప్పులు పాతగ అయితే వాళ్లకు ఇచ్చిన ఖర్చుల్లోకి మిగలవట్టి కొత్త చెప్పులు తెచ్చెటోళ్లు.. డ్రైవింగ్‌ చేయడానికి పోతే చాయ్‌ బిస్కెట్‌ కూడా తాగెటోన్ని కాదు.

పది రూపాయలు ఉంటే నా బిడ్డలకు పెన్ను కొనివ్వచ్చు. 20 రూపాయలు ఉంటే నోటు బుక్కు వస్తదికదా అనుకునే వాన్ని. వాళ్లు హైదరాబాద్‌లో ఉన్నా, కూడా రోజు మూడుసార్లు ఫోన్‌ చేసేవారు..తిన్నావా? టీ.తాగినవా నాయిన ఇంటికి పోయినవా.. తొందరగా ఇంటికిపో అంటూ గుర్తు చేస్తుండ్రి.. రెండు నెలల్ల ఇద్దరం జాబ్‌ చేస్తం.. వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్‌ తీస్కపోతాం నాయినా అంటూ చెప్పి బస్సెక్కిండ్రు. ఇట్ల నన్ను పూర్తిగా ఇడిసిబెట్టి పోతరనుకోలేదు.. ముగ్గురు బిడ్డలు ఎప్పు డూ ఒకేసారి బస్సుల పోలేదు. సాయిప్రియ రైల్లో పోతే ఇద్దరు బిడ్డలు బస్సుల పోతుండ్రి.. ఇప్పుడే ఇట్ల ముగ్గురు ఒకే బస్సుల పోయిండ్రు.. తిరిగి రాలేదు. నా ధైర్యం మొ త్తం వాల్లే.. ఇప్పుడు వాళ్లే లేకపోతే ఎట్లుండాల్నో ఏమి అర్థం అయితలేదు’అంటూ ఎల్లయ్యగౌడ్‌ కన్నీరు మున్నీరయ్యాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement