దశలవారీగా బీజేపీ ప్రచార జోరు.. ఆ సభకు అమిత్‌ షా లేదా నడ్డా! 

Telangana: BJP Campaign In Munugode By Poll Elections 2022 - Sakshi

మునుగోడులో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఉధృతంగా.. 

15 నుంచి ప్రచార బరిలో సంజయ్, కిషన్‌రెడ్డి, డీకే అరుణ 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ జాతీయ, రాష్ట్రనేతలు హోరెత్తించనున్నారు. దశలవారీగా ప్రచార వేగం పెంచాలనే వ్యూహంతో పార్టీ నాయకత్వముంది. ఈ నెల 14న ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే దాకా ఒక మోస్తరుగా, 17న ఉపసంహరణల పర్వం ముగిశాక మరోస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి చివరి వారం రోజులు పూర్తిస్థాయి ప్రచారంతోపాటు మొత్తం 298 పోలింగ్‌బూత్‌ల స్థాయిలో ఎన్నికల మేనేజ్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినట్టు సమాచారం.

సోమవారం కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో 7 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా మోహరించిన వివిధ స్థాయిల్లోని నాయకులపై, వారి కార్యక్షేత్రాలపై పార్టీకి ఓ స్పష్టత వచ్చింది. అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, మునుగోడులో అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలోభాగంగా ఓటర్ల జాబితాపైనా కమల దళం దృష్టి కేంద్రీకరించింది.

ఈ నియోజకవర్గంలో ఇటీవలి కాలంలోనే 23 వేల ఓట్లు కొత్తగా జాబితాలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గత 6, 7 నెలల్లో వెయ్యిదాకా కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఉప ఎన్నిక తేదీ ప్రకటించాక 23 వేల ఓట్లు కొత్తగా జాబితాలో చేర్చడాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలో భాగంగానే కొత్తగా ఓటర్లను చేర్చిందని ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. 

ముగింపు సభకు అమిత్‌ షా లేదా నడ్డా! 
ఈ నెల 15 నుంచి మునుగోడులో ముఖ్యనేతలు పూర్తిస్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నేతలు వారం పదిరోజుల పాటు అక్కడే బసచేయనున్నట్టు సమాచారం. 18 నుంచి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్, కార్యదర్శి అర్వింద్‌ మీనన్‌ ఇతర నేతలు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచార ముగింపు సభలో బీజేపీ అగ్రనేత అమిత్‌షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని పార్టీనేతలు చెబుతున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top