
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు సజావుగా జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకరించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభ్యులు అడిగే సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందజేయాలన్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం స్పీకర్ తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన చర్చలు జరిగే సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులు, సభ్యులకు తగిన సమాచారం అందజేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆదేశించారు.
భారీ వర్షాలతో కొన్ని మార్గాల్లో రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో సభ్యులు నిర్ణీత సమయానికి సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తు సమాచారం సేకరించి అడ్డుకోవడం ద్వారా సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ సూచించారు. కాగా, శాసనమండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన నోడల్, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.