పల్లె దవాఖానాలకు 1,492 మంది వైద్యులు 

Telangana: Appointment Of 1492 Doctors In Rural Dispensaries - Sakshi

కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి సర్కారు అనుమతి 

ఎంబీబీఎస్, ఆయుష్‌ వైద్యులు, స్టాఫ్‌ నర్సులకు అవకాశం 

పల్లెల్లో పెరగనున్న ఆరోగ్య సేవలు 

ఇప్పటికే 1,569 పోస్టుల భర్తీ పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను (మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు) కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,745 ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్లు ఉండగా, అందులో 3,206 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో 1,569 పోస్టులను ఇప్పటికే భర్తీ చేయగా, ఇప్పుడు కొత్తగా మరిన్ని నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇక నుంచి గ్రామీణ ప్రజలకు అనారోగ్యం వస్తే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పల్లెల్లోనే వైద్య సేవలు అందించనున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలకు మాత్రమే పెద్దాసుపత్రులకు వెళ్లడం తప్ప, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ జబ్బులకు ఇక పల్లె దవాఖానాల్లోనే చికిత్స చేస్తారు. ఈ దవాఖానాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్‌ కూడా సేకరిస్తారు. వాటిని టీ–డయాగ్నస్టిక్స్‌కు పంపుతారు.

అక్కడి నుండి వచ్చిన ఫలితాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తారు. కాగా, ప్రాథమిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా.. రోగులకు వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ వ్యాధి తీవ్రత ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు సీహెచ్‌సీ లేదా ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో వైద్య సేవలు అందించడానికి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది.  

అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 110 మంది.. 
పల్లె దవాఖానాల్లో తాజా నియామకాల్లో భాగంగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 110 మంది వైద్యులను నియమించనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 21, భద్రాద్రి కొత్తగూడెంలో 69, హనుమకొండ 25, జగిత్యాల 47, జనగాం 38, జయశంకర్‌ భూపాలపల్లి 31, గద్వాల, కామారెడ్డి జిల్లాల్లో 34 మంది చొప్పున, కరీంనగర్‌ 41, ఆసిఫాబాద్‌ 26, ఖమ్మం 73, మహబూబాబాద్‌ 91, మహబూబ్‌నగర్‌ 57, మంచిర్యాల 60, మెదక్‌ 36, మేడ్చల్‌ మల్కాజిగిరి 28, ములుగు 22, నాగర్‌కర్నూలు 52, నారాయణపేట 32, నిర్మల్‌ 39, నిజామాబాద్‌ 55, పెద్దపల్లి 31, రాజన్న సిరిసిల్ల 41, రంగారెడ్డి 50, సంగారెడ్డి 77, సిద్దిపేట 32, సూర్యాపేట 50, వికారాబాద్‌ 66, వనపర్తి 26, వరంగల్‌ 47, యాదాద్రి భువనగిరి జిల్లాలో 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

గతంలో భర్తీ చేసిన పోస్టుల్లో ఆయుష్‌ డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి కూడా ఎంబీబీఎస్‌ డాక్టర్లకు బదులుగా వీరే ఎక్కువగా దరఖాస్తు చేసుకునే అవకాశముందని చెపుతున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top