
ఇంకా మిగిలిపోయిన 10 వేల సీట్లు.. 10 రోజులు ఆలస్యంగా సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ కౌన్సెలింగ్‌లో ఎట్టకేలకు సాంకేతిక విద్యావిభాగం విద్యార్థులకు కాలేజీల్లో సీట్లు కేటాయించింది. వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ డేటా ఎరేజ్ అవ్వడం, దాన్ని వారం రోజుల తర్వాత రికవరీ చేయడంతో ముందుగా ప్రక టించిన తేదీకంటే పది రోజులు ఆలస్యంగా మంగళవారం సీట్లు కేటాయించారు. తొలివిడతలో 65.5 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు ప్రాధాన్యమిచ్చారు. వీటిల్లోని మొత్తం సీట్లలో 82 శాతం నిండగా, ప్రైవేట్ కాలేజీల్లో కేవలం 50 శాతం సీట్లు మాత్రమే నిండాయి. మొదటి విడత సీట్ల భర్తీ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 10,012 సీట్లు మిగిలాయి. అయితే, వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నా.. రెండు వేలమందికి సీట్లు రాకపోవటం గమనార్హం.
⇒ మొదటి విడతలో 6 కాలేజీల్లోని వందశాతం సీట్లు నిండాయి. వీటిలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా, ఒక ప్రైవేట్ కాలేజీ ఉంది.
⇒ ఈడబ్ల్యూఎస్ కోటాలో 713 సీట్లు నిండాయి. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌కోటాను తుదివిడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు.
⇒ సీట్లు పొందినవారు ఈ నెల 18లోగా ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోరి్టంగ్ చేయాలి.
⇒ తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత విద్యార్థులు ఈ నెల 28 నుంచి 30 లోపు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాలి. ఇలా రిపోర్ట్ చేయకపోతే సీటు కోల్పోతారు.
⇒ ఈ నెల 28 నుంచి 30 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహిస్తారు. 31 నుంచి పాలిటెక్నిక్ మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభమవుతాయి.
⇒ ఆగస్టు 2, 3 తేదీల్లో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలోని మరో బ్రాంచిలో సీటు ఖాళీగా ఉంటే ఈ స్లైడింగ్ విధానంలో మార్చుకోవచ్చు.