వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,679 కోట్లు | Telangana 2026-27 budget allocates Rs 13679 crore for health | Sakshi
Sakshi News home page

వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,679 కోట్లు

Mar 21 2026 6:17 AM | Updated on Mar 21 2026 6:17 AM

Telangana 2026-27 budget allocates Rs 13679 crore for health

గతేడాదికన్నారూ. 1,286 కోట్ల ఎక్కువ కేటాయింపులు

ఆరోగ్యశ్రీకి రూ. 1,143 కోట్లు.. డిజిటల్‌ హెల్త్‌కురూ. 911 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: వార్షిక బడ్జెట్‌లో ఈసారి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే సుమారు 10 శాతం నిధులు పెంచింది. 2025–26లో ఆరోగ్యశాఖకు రూ. 12,393 కోట్లు ప్రతిపాదించగా తాజా బడ్జెట్‌లో రూ. 13,679 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 6,985 కోట్లు, ప్రగతి పద్దు కోసం రూ. 6,695 కోట్లను ప్రతిపాదించింది. నిర్వహణ పద్దులో పరిపాలన, ఉద్యోగుల జీతభత్యాలు మొదలైన వాటికి నిధులు కేటాయించింది. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ కోసం రూ. 1,143 కోట్ల మేర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. అంటే నెలకు సుమారు రూ. 100 కోట్లను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు కేటాయించనుంది.

ప్రగతి పద్దులో నిధుల కేటాయింపు ఇలా...
వైద్య, ఆరోగ్యశాఖలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్వహణతోపాటు ఇతర వైద్య సంబంధమైన అంశాలకు బడ్జెట్‌లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి పద్దు కింద కేటాయించిన రూ. 6,695 కోట్లను ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాలు, పథకాల అమలుకు వినియోగించనుంది. ఈ బడ్జెట్‌లో మాతాశిశు ఆరోగ్యం, యువత ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, మానసిక ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.

తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీకి ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల స్థాయి పెంపుతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే మూడు ‘టిమ్స్‌’, వరంగల్‌ ఆసుపత్రి కోసం నిధులు వెచ్చించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement