సచివాలయంలో ఉద్యోగుల నిరసన
ఓపీఎస్ అమలుతోనే ఉద్యోగులకు మేలు.. వెల్లువెత్తిన నిరసనలు
హెచ్‌ఓడీల వద్ద టీఈజేఏసీ నిరసన ప్రదర్శనలు
బీమా భవన్, సీసీఎల్‌ఏ, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల వద్ద నిరసనల్లో పాల్గొన్న జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ, ఉపాధ్యాయులు గొంతెత్తారు. పుష్కరకాలం క్రితం తీసుకొచ్చిన ఈ పథకం..ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడేసే పరిస్థితికి తీసుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించిన ఉద్యోగులు... మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
ఉదయం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు.. సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలుతోనే ఉద్యోగులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టగా,రాష్ట్ర హెచ్‌ఓడీల ఎదుట, సచివాలయంలోనూ ఈ నిరసన కార్యక్రమాలు జోరుగా సాగాయి.
» తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీజీఓ ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, టీఎన్జీఓ ప్రధా న కార్యదర్శి ముజీబ్ గగన్‌విహార్‌లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట నిరసనలో పాల్గొన్నారు.
» అబిడ్స్‌లోని బీమా భవన్ ఎదుట నిరసన కార్యక్రమంలో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు. టీఎస్‌సీపీఎస్ ఈయూ అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొనగా, అబిడ్స్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ పాల్గొన్నారు.
» ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 6 డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎ స్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌గౌడ్ డిమాండ్ చేశారు.
» టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తే ఎంతో ఉత్సాహంతో పనిచేస్తారన్నారు.
» టీజీఓ ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, మాట్లాడుతూ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఇతర మొత్తాలను దరఖాస్తు చేసుకున్న వెంటనే విడుదల చేయాలన్నారు.
హామీని నిలబెట్టుకోవాలి: మారం జగదీశ్వర్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీకి అనుగుణంగా ప్రభుత్వం ఓపీఎస్‌ను అమలు చేయాలని టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు హామీని అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.
వారికి పెన్షన్ ఎందుకు: ఏలూరి
మూడు దశాబ్దాలకు పైగా నిరంతరం ప్రజాసేవ చేసే ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రుద్ది... కేవలం ఐదేళ్లు ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వారికి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడం ఏ రకమైన న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


