సిద్దిపేట మార్కెట్ యార్డులో 50 రోజులుగా పేరుకుపోయిన పొద్దుతిరుగుడు గింజల రాశులు
50 రోజులుగా మార్కెట్ యార్డుల్లోనే రైతుల పడిగాపులు
సాక్షి, సిద్దిపేట: వరికి ప్రత్యామ్నాయంగా పొద్దు తిరుగుడు పండించిన రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,900 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు గింజలను కొనుగోలు చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పొద్దుతిరుగుడు గింజల కొనుగోలుపై ఊసే ఎత్తడం లేదు. దీంతో 50 రోజులుగా మార్కెట్లలోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు.
మార్కెట్లలో పొద్దుతిరుగుడు గింజల రాశులు
రాష్ట్ర వ్యాప్తంగా 19,649 ఎకరాల్లో సన్‌ఫ్లవర్‌ను సాగు చేయగా 19 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రాష్ట్రం నుంచి కేంద్రం 3,900 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కేంద్రం ఇచ్చిన టార్గెట్ స¯న్‌ఫ్లవర్ గింజల కొనుగోళ్లు పూర్తయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సన్ ఫ్లవర్ గింజల కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో 50 రోజులుగా కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర «క్వింటాకు రూ.7,721 చెల్లిస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ. 5,500 నుంచి రూ.6 వేలకే పొద్దు తిరుగుడు గింజలను కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే పెట్టుబడి సైతం రాదని, నష్టం వస్తుందని... ప్రభుత్వానికే అమ్మాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పంట పండించి ఏం లాభం ?
పొద్దుతిరుగుడు పంటను 3 ఎకరాల్లో సాగు చేశా. 30 బస్తాల గింజలను తీసుకొచ్చి మార్కెట్‌లో పోసి 50 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు కొనుగోలు చేస్తామనేది అధికారులు చెప్పడం లేదు. –బీ పరశురాములు, బుస్సాపూర్
ఎవరూ పట్టించుకోవడం లేదు
35 బస్తాల పొద్దుతిరుగుడు గింజలు మార్కెట్‌కు తీసుకొచ్చి 40 రోజులు అవుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. కేంద్రం కొనుగోళ్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో ఎవరూ చెప్పడం లేదు. –లక్ష్మారెడ్డి, సిద్దిపేట


