దుగ్గొండి: కూతురు పుట్టిన రోజు వేడుక కోసం ఓ మహిళ కొత్త దుస్తులు కొనడానికి వరంగల్ వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాలేదు. తెల్లవారేసరికి గ్రామానికి సమీపంలోని ఎస్సారెస్పీ ఉప కాల్వలో శవమై కనిపించింది. ఆమెను గొంతుకోసి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలత(35) భర్త మహేందర్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటినుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది.
గురువారం తన కుమార్తె తేజస్విని పుట్టినరోజు ఉండటంతో కొత్త బట్టలు కొనడానికి బుధవారం(20న) వరంగల్‌కు వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి రాలేదు. గురువారం ఉదయాన్నే ఉపాధి పనులు చేయడానికి వెళ్లిన కూలీలకు లక్ష్మీపురం– ఎలుకుర్తి గ్రామాల మధ్య ఉన్న ఎస్సారెస్పీ ఉప కాల్వలో మహిళ శవం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రావుల రణదీర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాల్వ గట్టున మహిళ చెప్పులు, కొంత దూరాన హ్యాండ్‌బ్యాగ్, రక్తపు మరకలు, పదునైన కత్తి, కాలువలో సగం వరకు గొంతు కోసి ఉన్న మహిళ మృతదేహం కనిపించాయి. మృతురాలు తాళ్లపెల్లి సుమలతగా గుర్తించారు. మహిళను కాల్వ గట్టుపై గొంతుకోసి చనిపోయిన అనంతరం కాల్వలోకి తోసి వేసినట్లు గుర్తించారు.
సంఘటన స్థలాన్ని డీసీపీ అంకిత్‌కుమార్, నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ సాయిరమణ పరిశీలించి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతురాలి తండ్రి చిలువేరు కట్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిరమణ తెలిపారు. ఒంటరిగా ఉంటున్న సుమలతను దుండగులు అత్యాచారం చేసి హత్యచేశారా.. లేక ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులు చేశారా.. లేక వివాహేతర సంబంధాలే కారణమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సుమలతతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో పాటు ఆమెకు గతంలో ఇదే గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.


