Telangana: తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రమే..!

Student Attendance On The First Day Was Nominal In Telangana - Sakshi

తొలిరోజు ప్రభుత్వ స్కూళ్లలో 27.45%, ప్రైవేటులో 18.35% హాజరు 

గ్రామీణ ప్రాంతాల్లో కనిపించని ‘కరోనా’ భయం 

పట్టణాలు, నగరాల్లో వేచిచూసే ధోరణిలో తల్లిదండ్రులు 

ఆన్‌లైన్‌ బోధనకే ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల మొగ్గు 

కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి.. ఇంటర్‌లో 15 శాతమే హాజరు

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైనా.. తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది. బుధవారం చాలావరకు ప్రభుత్వ, ప్రైవేటు బడులన్నీ బోసిపోయి కనిపించాయి. విద్యార్థులను బడులకు రప్పించేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రయత్నించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులు కూడా రంగంలోకి దిగారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. కానీ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపించింది.

ఇంకొన్ని రోజులు వేచిచూద్దామని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వం ఆన్‌లైన్‌ బోధనకు వెసులుబాటు ఇవ్వడంతో.. పాఠశాలలతో పాటు విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌నే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది. బుధవారమే మొదటి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని, కొద్దిరోజుల్లోనే పుంజుకుంటుందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. 

సగటున 22 శాతం మించలేదు 
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు మినహా అన్ని విద్యాసంస్థలను పునః ప్రారంభించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తొలిరోజున ప్రభుత్వ స్కూళ్లలో 27.45 శాతం, ప్రైవేటు బడుల్లో 18.35 శాతం విద్యార్థుల హాజరునమోదైంది. మొత్తంగా సగటు హాజరుశాతం 22కు మించలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 405 ఇంటర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ విద్యార్థులు 97,520 మందికిగాను 16,907 మంది.. సెకండియర్‌లో 84,038 మందికిగాను 12,687 మంది హాజరయ్యారు. సగటున 15 శాతమే హాజరు నమోదైంది. 

భయం భయంగానే.. 

  • పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎక్కువ మంది బడికి వచ్చారు. గ్రామాల్లో తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు కన్పించలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే సీజనల్‌ జ్వరాలు, ఇతర అనారోగ్యం ఉన్నవారిని బడులకు రాకుండా చూశారు. వ్యవసాయ పనులకు వెళ్లే విద్యార్థుల్లో చాలా వరకు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు. 
  • పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. తల్లిదండ్రులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని, క్రమంగా హాజరు పుంజుకుంటుందని అధికారులు చెప్తున్నారు. 
  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లలో హాజరు కాస్త మెరుగ్గా ఉంది. కానీ సమీపంలోని పట్టణాలు, వేరే ఊర్లలో చదువుతున్న విద్యార్థులు మాత్రం వెళ్లలేదు. పాఠశాలల వాహనాలు గ్రామాలకు వచ్చినా తల్లిదండ్రులు పిల్లలను పంపలేదు. 
  • పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో హాజరుశాతం తక్కువగా కనిపించింది. ఏడాదిన్నరగా బడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో చాలామంది తల్లిదండ్రులు సొంతూర్లకు వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు పట్టణాలకు వచ్చే పరిస్థితి లేదు. దానికితోడు ఆన్‌లైన్‌ బోధన ఉండటంతో.. దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 
  • కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చాలా వరకు ఆన్‌లైన్‌ బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. చిన్నగదుల్లో ప్రత్యక్ష బోధన వల్ల సమస్యలు రావొచ్చనే ఆలోచనతో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతకాలం పరిస్థితిని గమనించాకే స్కూళ్లకు పంపాలని భావిస్తున్నారు. 

 బుధవారం స్కూళ్లు, విద్యార్థుల పరిస్థితి ఇదీ.. 
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో మొత్తం విద్యార్థులు: 52,22,174 
తొలిరోజు హాజరైన విద్యార్థుల సంఖ్య: 11,37,095 (21.77 శాతం) 
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు: 19,66,234 
హాజరైన విద్యార్థులు: 5,39,674 (27.45 శాతం) 
ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు: 32,55,940 
హాజరైన విద్యార్థులు: 5,97,421 (18.35 శాతం) 
 
బడికి రెడీ.. సైకిలే రిపేర్‌..  
ఖమ్మం జిల్లా కేంద్రంలో పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరిన విద్యార్థి ఇతను. సైకిల్‌ మొరాయించడంతో మధ్యలో ఆగి మరమ్మతు చేయించుకున్నాడు. 
 
చిన్న పిల్లలు రాలే.. 
ఖమ్మం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం ఇది. బుధవారం ఈ కేంద్రాన్ని తెరిచినా.. పిల్లలెవరూ రాక టీచర్‌ ఖాళీగా కూర్చున్నారు. 
 
బడికి కొందరు.. చెత్త ఏరుతున్న మరికొందరు 
ప్రత్యక్ష బోధన ప్రారంభం కావడంతో.. కొందరు పిల్లలు బడిబాట పట్టినా, మరికొందరు పనులకు వెళ్లారు. భువనగిరి పట్టణంలో కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలోనే మరికొందరు పిల్లలు చెత్త పేపర్లు సేకరిస్తున్న దృశ్యమిది. 

తొలిరోజే.. తృటిలో తప్పిన ప్రమాదం 
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని తిమ్మాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో తొలిరోజు అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న పాత గదుల్లో కొన్నేళ్లుగా అంగన్‌వాడీ కేంద్రం కొనసాగుతోంది. బుధవారం ఈ కేంద్రానికి వచ్చిన గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ హెల్పర్‌ మౌనిక సరుకులు అందజేస్తుండగా.. భవనంపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా అందరూ బయటికి పరుగెత్తారు. భవనం పాక్షికంగా దెబ్బతింది. 

ఇద్దరు విద్యార్థులు.. పది మంది లెక్చరర్లు 
మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు కాలేజీలోని పది మంది లెక్చరర్లు విధులకు వచ్చారు. 
 
మంగళ హారతులిచ్చి.. 
మెదక్‌ జిల్లా కుర్తివాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు వీరు. విద్యార్థులను శుభ సూచకంతో స్వాగతించాలని ఇలా చేసినట్టు వారు చెప్పారు. 

బురదలో నడుచుకుంటూ.. 
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద బురదలో నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులు. పాఠశాలకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో ఇటీవలి వర్షాలకు నీళ్లు నిలిచి బురదగా మారింది. 

డప్పులతో విద్యార్థులకు స్వాగతం 
చాలా రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులకు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతున్న దృశ్యమిది. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌ పాఠశాలలో అక్కడి సర్పంచ్‌ నర్సాగౌడ్, ఉపాధ్యాయులు ఇలా స్వాగతం పలికారు. 

గదులు లేక.. వరండాలో చదువులు 
ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరండాలో కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు వీరు. మొత్తంగా 142 మంది విద్యార్థులు ఉండగా.. మూడే తరగతి గదులు ఉన్నాయి. దీనితో 7, 8వ తరగతుల విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. 

బడి కూలిపోయేలా ఉంది సార్‌.. 

  • మంత్రి కేటీఆర్‌కు జనగామ ఉపాధ్యాయుల ట్వీట్‌ 
  • తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు! 

జనగామ:  జనగామ జిల్లా కేంద్రంలో సిద్దిపేట రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. 160 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో తరగతి గదుల పైకప్పు దెబ్బతింది. ఇటీవలి వర్షాలతో గోడలు తడిసి, గదుల్లోకి నీరు వస్తోంది. ఉపాధ్యాయులు దీనిపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘‘జనగామలో బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులతోపాటు వరండా పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. బడి కోసం కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. పాఠశాల తరలింపు, కొత్త భవన నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. 

బడిలో విద్యాశాఖ కమిషనర్‌.. 
బీబీనగర్, భూదాన్‌ పోచంపల్లి: పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండటంతో విద్యా శాఖ కమిషనర్‌ దేవసేన.. బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్కూళ్లను సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని రాయరావుపేట, జామీలపేట, పడమటి సోమవారం గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను, భూదాన్‌ పోచంపల్లి పట్టణంలోని మోడల్‌ స్కూల్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కోవిడ్‌ నిబంధనలను సక్రమంగా పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top