వృద్ధికి వ్యవసాయం, రియల్‌ దన్ను!

Statistics of Indian Economy 2021 22 Report Released - Sakshi

ప్రస్తుత ధరలతో పోలిస్తే రూ.10.41 లక్షల కోట్లు దాటిన నికర రాష్ట్ర విలువ 

2014–15తో పోలిస్తే రెండింతలు 

దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో రిజర్వు బ్యాంకు వెల్లడి 

తయారీ, వ్యాపారం, ఆతిథ్య రంగాల్లోనూ దూకుడు 

1.20 కోట్ల టన్నులు దాటిన వరి.. కోటిన్నర టన్నులు మించిన ఇతర ఆహార ధాన్యాల ఉత్పత్తి 

రూ.2.75 లక్షలు దాటిన తలసరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శరవేగంతో దూసుకెళుతోంది. రియల్‌ ఎస్టేట్, వ్యవసాయ రంగాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. తయారీ, వ్యాపారం, ఆతిథ్య రంగాలు వెన్నంటి నిలుస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడేళ్లలో నికర రాష్ట్ర విలువ (నెట్‌ స్టేట్‌ వ్యాల్యూ యాడెడ్‌– ఎన్‌ఎస్‌వీఏ) రెండింతలు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గురువారం ‘భారత ఆర్థిక వ్యవస్థ గణాంకాలు 2021–22’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ధరలతో పోలిస్తే.. 2014–15లో నికర రాష్ట్ర విలువ రూ. 4.56 లక్షల కోట్లుకాగా.. 2021–22 నాటికి అది రూ. 10.41 లక్షల కోట్లు దాటిందని రిజర్వు బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

దూకుడుగా రియల్‌ రంగం.. 
రంగాల వారీగా చూస్తే.. నికర రాష్ట్ర విలువలో రియల్‌ ఎస్టేట్‌ రంగం అత్యధిక విలువ (రూ.1,86,257 కోట్లు) నమోదు చేయగా.. ఆ తర్వాత వ్యవసాయ రంగం (రూ.1,81,702 కోట్లు) నిలిచింది. ఇక నికర తలసరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (పర్‌ క్యాపిటా నెట్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) కూడా గత ఏడేళ్లలో రెండింతలకన్నా పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో నికర తలసరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,24,104 కాగా, అది 2021–22లో రూ.2,75,443కు చేరింది. 

భారీగా పంటల దిగుబడితో.. 
ఆర్‌బీఐ తాజా నివేదికలో రాష్ట్రాల వారీగా పంటల దిగుబడి వివరాలను కూడా వెల్లడించింది. తెలంగాణలో వరి ఉత్పత్తి 1.20 కోట్ల టన్నులు దాటింది. 2015–16లో 30.470 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా.. 2021–22 నాటికి 123.02 లక్షల టన్నులకు పెరిగింది. ఇక ఇతర ఆహార ధాన్యాల విషయానికి వస్తే.. 2015–16లో 51.290 లక్షల టన్నులు ఉత్పత్తికాగా.. 2021–22 నాటికి కోటిన్నర టన్నులు దాటింది. 

ఏమిటీ ‘నెట్‌ స్టేట్‌ వ్యాల్యూ యాడెడ్‌’? 
సాధారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తుసేవల విలువను ‘జీఎస్‌డీపీ (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ – రాష్ట్ర స్థూల ఉత్పత్తి)’ అంటారు. ఇది ఆ రాష్ట్రంలో ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మొత్తం విలువను చెబుతుంది. అయితే ఆ ఉత్పత్తి కోసం అయ్యే మూలధన వ్యయాలు, జరిగే వినియోగానికి సంబంధించిన విలువను అందులోంచి తొలగిస్తే.. దానిని ‘నెట్‌ స్టేట్‌ వ్యాల్యూ యాడెడ్‌’ అని చెప్పవచ్చు. ఉదహరణకు ఒక రాష్ట్ర జీఎస్‌డీపీ పది లక్షల కోట్లు, అందులో ఉత్పత్తి మూలధన వ్యయం, వినియోగం లక్షన్నర కోట్లు అనుకుంటే... ఆ రాష్ట్రంలో నికరంగా జతకూడిన విలువ ఎనిమిదిన్నర లక్షల కోట్లు అన్నమాట.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top